‘కోర్ట్’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవి జంట మరోమారు ఓ అందమైన ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. ఈ సినిమాకు ‘బ్యాండ్ మేళం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఎవ్రీ బీట్ హ్యాజ్ యాన్ ఎమోషన్’ ఉపశీర్షిక. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్స్ పతాకంపై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. బుధవారం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. తెలంగాణ జానపద గీతంతో గ్లింప్స్ మొదలైంది.
తెలంగాణ యాసలో నాయకానాయికల మధ్య జరిగే సంభాషణ ఆకట్టుకునేలా ఉంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఓ అందమైన ప్రేమకథగా చిత్రాన్ని తీర్చిదిద్దారని గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతున్నది. చంద్రబోస్ సాహిత్యాన్నందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: విజయ్ బుల్గానిన్, సమర్పణ: మ్యాంగో మాస్ మీడియా, రచన-దర్శకత్వం: సతీష్ జవ్వాజీ.