ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రదర్శించే థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు అదనంగా రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు శనివారం జీవో విడుదల చేసింది. రేట్ల పెంపు తొలి మూడు రోజులు, తర్వాతి వారం రోజులుగా మొత్తం 10 రోజులు వర్తిస్తాయని జీవోలో వెల్లడించారు. నాన్ ఏసీ థియేటర్లలో ఎలాంటి పెంపు లేదు. ఏసీ థియేటర్లలో సినిమా విడుదలైన తొలి మూడు రోజులు 50 రూపాయలు, తర్వాత వారం రోజులు 30 రూపాయలు, మల్టీప్లెక్స్‌లు, బిగ్ స్క్రీన్లలో తొలి మూడు రోజులు 100 రూపాయలు, తర్వాత వారం 50 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే ఐదో ఆటకూ అనుమతులు జారీ చేసింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఈ సినిమా ప్రదర్శనలు జరగనున్నాయి.