Akhanda 2 | నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న అఖండ 2 చిత్రానికి సంబంధించి టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి సంబంధించి టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం చిత్ర నిర్మాతలు సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి టికెట్‌పై అదనంగా రూ.50 చొప్పున, అలాగే మల్టీ ప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి అదనంగా రూ.100 చొప్పున ధరను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. బాలకృష్ణ అభిమానుల కోసం ప్రత్యేకంగా డిసెంబరు 4వ తేదీన రాత్రి 8 గంటలకు ఒక స్పెషల్ ప్రీమియర్ షోను ప్రదర్శించడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.600గా నిర్ణయించారు. అయితే, పెంచిన ఈ టికెట్ ధరలు సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు మాత్రమే అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.