30శాతం వేతనాలు పెంచాలంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె ఊహించని మలుపులు తిరుగుతున్నది. తెలుగు సినీ నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని, అందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, కార్మికులు తమ పనిని కొనసాగిస్తూనే డిమాండ్స్ నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని, షూటింగ్స్ నిలిపివేయడం సమంజసం కాదని, ఇరు సంఘాల ప్రతినిధులు ఒకరి ఇబ్బందులను ఒకరు అర్థం చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని.. తెలుగు సినీ నిర్మాతలకు, ఫెడరేషన్ ప్రతినిధులకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం జరిగిన సమావేశంలో సూచించిన విషయం తెలిసిందే.
రాష్ట్రమంత్రి జోక్యం తర్వాత, బుధవారం ఇరు వర్గాల మధ్య జరిగే చర్చలు ఓ కొలిక్కి రానున్నాయని, పరిస్థితులు చక్కబడి షూటింగులు మొదలవుతాయని అంతా భావించారు. కానీ నిర్మాతలు, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధుల మధ్య బుధవారం జరిగిన చర్చలు మళ్లీ విఫలమయ్యాయి. ఇరు వర్గాల ప్రతిపాదనలు కొలిక్కిరాకపోవడంతో పరిస్థితి మొదటికొచ్చింది. డాన్సర్లు, ఫైటర్లు, సాంకేతిక నిపుణులు.. ఈ మూడు యూనియన్లకు వేతన పర్సంటేజ్ పెంచలేమని నిర్మాతలు ఖరాకండిగా చెప్పేశారు. ఆ ప్రతిపాదనను ఫెడరేషన్ అంగీకరించలేదు. దాంతో సమ్మె ఇంకొన్ని రోజులు కొనసాగక తప్పేలా లేదు. సమ్మె కొనసాగించేందుకు తామూ సిద్ధంగానే ఉన్నామని ఈ సందర్భంగా నిర్మాతలు కూడా తెగేసి చెప్పేశారు. రేపు, ఎల్లుండి కూడా చర్చలు కొనసాగుతాయని నిర్మాత సి.కల్యాణ్ తెలియజేశారు.
సినీకార్మికుల వేతనాల పెంపు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదని, నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల చర్చలు కొనసాగుతున్నాయని, తమ షరతుల్ని అంగీకరిస్తే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సుముఖంగానే ఉన్నారని దిల్‌రాజు తెలిపారు. బుధవారం నిర్మాతలకు, ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులకు జరిగిన చర్చలు విఫలం కావడంతో.. తదనంతరం అగ్ర నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీ అనంతరం అ వివరాలను ఆయన మీడియాకు తెలియజేశారు. ‘వేతనాలు పెంచే విషయంలో నిర్మాతలకు కొన్ని షరతులున్నాయి. 2018, 2022లలో జరిగిన అగ్రిమెంట్స్ ప్రకారం నిర్మాతలు ప్రతిపాదించిన రెండు పని విధానాలను ఫెడరేషన్ ఇంకా అమలు చేయడంలేదు.
ముందు వాటిని అమలు చేయాలి. వాటితోపాటు మరో రెండు వర్కింగ్ కండీషన్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా అంగీకరించాలి. అదే విషయాన్ని ఛాంబర్ ద్వారా ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లాం. వాటి విషయంలో ఫెడరేషన్ తుది నిర్ణయాన్ని బట్టి వేతనాలు పెంపు ఉంటుంది. ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లిన వర్కింగ్ కండీషన్లు ఒప్పుకుంటే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. రోజుకు రూ.2వేలు కన్నా తక్కువ వేతనం తీసుకునే వారికి ఒక పర్సంటేజీ ఆఫర్ చేస్తున్నాం. దానికన్నా ఎక్కువ వేతనం తీసుకునేవారికి ఓ పర్సంటేజీ ఆఫర్ చేస్తున్నాం. ఫెడరేషన్‌లోని యూనియన్లన్నీ ఈ కండీషన్లపై మాట్లాడుకొని ఓ నిర్ణయానికొస్తే.. దీనిని పరిష్కరిస్తాం.’ అని తెలిపారు.