రాష్ట్రం విడిపోయి పుష్కరం కాలం దాటింది. అయినా మళ్లీ అదే సాంస్కృతిక దాడి. యాసను, భాషను, మాండలికాన్ని అంగీకరించలేని సంకుచిత మనస్తత్వం. గిల్లిగిచ్చి పొందే రాక్షసానందం. ఇప్పుడిదంతా ఎందుకంటే ఇటీవలే తెలంగాణ నేపథ్యంలో ‘ఇడుపు కాయితం’ సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. ప్రియదర్శి హీరోగా, తెలంగాణ జానపద పాటల ద్వారా పాపులర్ అయిన నాగదుర్గ కథానాయికగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా పోస్టర్ వెలువడిన నాటి నుంచి సోషల్‌మీడియా వేదికగా టైటిల్‌ను అపహాస్యం చేస్తూ వెకిలి పోస్టుల పరంపర మొదలైంది. ‘ఆంధ్రలో ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటుందా?’, ‘తెలుగు భాషలో డబ్ చేస్తారా? లేక తెలంగాణ భాషలోనే చూడాలా? సబ్‌టైటిల్స్ వేస్తే హ్యాపీ అవుతాం ఆంధ్రోళ్లం’ అంటూ నిలువెల్లా విద్వేషంతో కనిపిస్తున్న పోస్టులు తెలంగాణ వాదుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. స్వరాష్ట్రంలో ఎదుగుతున్న తెలంగాణ సినిమాపై కడుపుమంట ఇదని సోషల్‌మీడియాలో కౌంటర్ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
భాషకు నిజమైన అందాన్ని, సొగసును తీసుకొచ్చేవి ఆయా ప్రాంతాల తాలూకు మాండలికాలే అన్నది నిర్వివాదాంశం. భౌగోళిక పరిస్థితులు, సాంస్కృతిక ప్రభావాలను బట్టి ప్రతి వందకిలోమీటర్ల్లకు యాస, భాషలతో పాటు మాండలికాలు కూడా మారుతుంటాయని భాషావేత్తలు చెబుతుంటారు. వీటిపై ఏమాత్రం అవగాహన లేకుండా తెలంగాణ మాండలికమే లక్ష్యంగా ‘ఇడుపు కాయితం’ టైటిల్‌పై దాడి మొదలైంది. ఇడుపుకాయితం అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ వ్యవహారిక పదం. ఆలుమగలు విడిపోయే ముందు రాసుకునే అంగీకార పత్రమని అర్థం. ఈతరం తెలంగాణ యువతకు కూడా ఈ మాట సుపరిచితమే. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఇక్కడి ప్రాంతీయ సినిమా స్వీయ అస్తిత్వంతో నిలదొక్కుకుంటున్నది. ఒకప్పుడు తెలంగాణ యాసను వెకిలి హాస్య పాత్రలకు, విలన్లకు ఆపాదించిన దుర్మార్గపు వైఖరికి చరమగీతం పాడి ఇక్కడి మట్టి కథలు వెండితెరపై ప్రాణం పోసుకుంటున్నాయి. ఈ క్రమంలో వచ్చినవే మల్లేశం, ఫిదా, బలగం, దండోరా లాంటి సినిమాలు. వీటితో పాటు తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ప్రధాన స్రవంతి వాణిజ్య చిత్రాలు కూడా చక్కటి ప్రేక్షకాదరణ పొందాయి. గత పుష్కరకాలంలో తెలుగు సినిమాలో తెలంగాణ నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. ఈ పరిణామాలన్నీ సోకాల్డ్ తెలంగాణ వ్యతిరేకులకు కంటగింపుగా మారాయి. ఈ క్రమంలో ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్లోనే అచ్చమైన తెలంగాణ యాస కనబడింది. దాంతో విచక్షణ కోల్పోయి సోషల్‌మీడియా వేదికగా కవ్వించడం మొదలుపెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
‘ఇడుపు కాయితం’ టైటిల్‌పై సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న దుర్మార్గపు దాడిని తెలంగాణ వాదులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. వరుస కౌంటర్ పోస్టులతో భాష, యాసల గురించి వాస్తవాల్ని తెలియజెపుతూ కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరేమో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే అసలు ఇడుపు కాయితం అంటూ రాష్ట్ర విభజనను ఉటంకిస్తూ చురకలంటిస్తున్నారు. తెలంగాణ ఆత్మాభిమానంపై దాడి చేస్తే ఏమాత్రం సహించేదిలేదని హెచ్చరిస్తున్నారు. మరికొందరేమో ‘ఇడుపు కాయితం’ మీద జరుగుతున్న దాడిని రాజకీయ కోణంలో కూడా చూడాలంటున్నారు. ఆంధ్రలో ఓ పార్టీకి కొమ్ముకాసే శక్తులే ఈ విషప్రచారానికి తెగించాయని అభిప్రాయపడుతున్నారు. రాజధాని కట్టుకోవడం చేతకాదు, పోలవరం పూర్తిచేసుకునే తెలివిలేదు కానీ..పక్కరాష్ట్రం మీద పడి బలుపు ప్రదర్శిస్తున్నారని కొందరు నెటిజన్లు స్ట్రాంగ్కౌంటర్లిస్తున్నారు. ఇక్కడి పాలితుడికే తెలంగాణ స్పృహ లేదని, అందుకే తెలంగాణ వ్యతిరేక శక్తులు ఇక్కడి అస్తిత్వంపై తెగబడటానికి ఏ అంశాన్ని వదిలిపెట్టడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఇటీవలకాలంలో ఏ సినిమా టైటిల్‌పై జరగనంత చర్చ ‘ఇడుపు కాయితం’పై నడుస్తున్నది. సోషల్‌మీడియా వేదికగా ఓ ప్రాంతపు యాస, భాష, మాండలికంపై అక్కసువెళ్లగక్కే మూర్ఖులను ఏమాత్ర ఉపేక్షించొద్దని, గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనని తెలంగాణ వాదులు బలంగా కోరుకుంటున్నారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రాంతీయ సినిమా నూతన జవసత్వాల్ని ప్రోదిచేసుకొని సగర్వంగా నిలబడింది. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ నటీనటులు, టెక్నీషియన్స్‌ను చిన్నచూపు చూసేవారు. ఏ విభాగంలో కానీ వారికి సరైన ప్రాధాన్యత ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పరిస్థితుల్లో క్రమంగా మార్పు వచ్చింది. తెలంగాణ వారికి ఇండస్ట్రీలో అవకాశాలు మెరుగుపడ్డాయి. ఏ పరిశ్రమలోనైతే వివక్షకు లోనయ్యారో అక్కడే స్వాభిమానంతో నిలదొక్కుకున్నారు. అప్పటివరకు జోకర్లు, విలన్లు మాట్లాడిన తెలంగాణ యాస హీరోల నోట వినబడటం మొదలైంది. స్వీయ రాజకీయ అధికారం పరిశ్రమను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలంగాణ సినిమా ఔత్సాహికులు అర్థం చేసుకున్నారు. దాంతో వారికి అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తెలంగాణ నేపథ్యంలో పెళ్లిచూపులు, మల్లేశం, అర్జున్ రెడ్డి, ఫిదా, లవ్‌స్టోరీ, బలగం, దసరా వంటి హిట్ చిత్రాలొచ్చాయి. అయితే గత రెండున్నరేళ్లుగా పరిశ్రమలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఇండస్ట్రీలో తెలంగాణ గళం మూగబోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గద్దర్ సినీ పురస్కారాల్లో కూడా తెలంగాణ వారికి అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సింహభాగం అవార్డులను ఆంధ్ర నటీనటులు, సాంకేతిక నిపుణులకే అందించారనే విమర్శలొచ్చాయి. తెలుగు సినీరంగంలో తెలంగాణ వారి పట్ల మళ్లీ వివక్ష మొదలైందని, సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయని తెలంగాణ దర్శకనిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
‘ఇడుపు కాయితం’ టైటిల్ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేమని అంటున్నారు. ఉద్ధేశ్యపూర్వకంగానే తెలంగాణ నేపథ్య సినిమాలు, హీరోలపై సోషల్ మీడియా వేదికగా విషప్రచారం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు గత కొన్నేళ్లుగా జరుగుతున్న సంఘటనల్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ అగ్ర హీరో సినిమా విడుదలైన ప్రతీ సందర్భంలో సోషల్‌మీడియాలో ఓ వర్గం ట్రోలింగ్‌కు పాల్పడటం, సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడం ఆనవాయితీగా మారింది. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా సినిమా విషయంలో కూడా ఇప్పటి నుంచే సోషల్‌మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అతని వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టులు కనిపిస్తున్నాయి. తెలుగు సినిమాలో తెలంగాణ హీరోల ప్రాభవాన్ని, తెలంగాణ కథల ఉనికిని ఏమాత్రం సహించలేని ఉన్మాద శక్తులే తెరవెనక ఈ ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు తెలంగాణ దర్శకనిర్మాతలు అంటున్నారు.
‘ఇడుపు కాయితం’ టైటిల్ వివాదం నేపథ్యంలో నటుడు రాహు ల్ రామకృష్ణ తన ఎక్స్ ఖాతా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. ‘నాలుగు ప్రశ్నలు అడిగితే కుదరదు. మన సినిమాలను, మన కథలను అంగీకరించలేరు. అయినా ఓకే..మా ప్రియదర్శి చింపేస్తాడు. మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటా యి. మాకు అనువైన యాసలో మేం కథల్ని చెప్పుకుంటాం’ అంటూ రాహుల్ రామకృష్ణ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.