ఖైరతాబాద్, ఆగస్టు 20 : తెలంగాణ సినిమాకు ప్రత్యేక పాలసీ అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖ దర్శకుడు శంకర్, కవి, రచయిత నందిని సిధారెడ్డితో కలిసి మాట్లాడారు. తెలంగాణ జీవన విధానం లేకుండా తీసిన సినిమా తెలంగాణ సినిమానే కాదన్నారు. తెలంగాణ పాటలు, కథలు, మనుషులు,మన సంస్కృతి తప్పనిసరిగా ప్రతిబింబించాలన్నారు. అప్పుడే అది నిజమైన సినిమా అవుతుందన్నారు. దానికి ప్రత్యేక పాలసీ, ప్రభుత్వ సహకారం, అభివృద్ధి కార్పొరేషన్ మద్దతు ఉండాలన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రాంతీయ సినిమాలకు సబ్సిడీలు, పెట్టుబడులు అందించాలన్నారు. కొత్త ప్రతిభకు అవకాశాలు కల్పించడానికి ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్స్, థియేటర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యమం లేకుండా ఎలాంటి ఫలితం రాదని, ముందడుగు మనమే వేయాలని, అప్పుడు వెనుక అనేక మంది వస్తారన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు. తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర అధ్యక్షులు లారా మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలే కాదు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల స్వేచ్ఛ కూడా రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఉన్నాయన్నారు.
మన రాష్ట్రం, మన సినిమా నిర్మాణం కాగితాలకే పరిమితమైందన్నారు. ఆంధ్ర, తెలంగాణ సినిమా విభజన చట్టాన్ని అమలుచేయాలన్నారు. సినిమా అభివృద్ధి కోసం ప్రభుత్వ భూములను తీసుకొని కొందరు రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చారని, తక్షణమే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. వంద ఎకరాలలో ప్రొఫెసర్ జయశంకర్ ఫిల్మ్ అండ్ యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం చేయబోయే ప్రతి సినిమాలో 24 క్రాఫ్ట్స్ నుంచి 50 శాతం తెలంగాణ వారినే తీసుకోవాలని, అలా తీసుకోని పక్షంలో వారిని తెలంగాణ సినిమా వేదిక ప్రశ్నించడానికి వెనుకాడదన్నారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతితో వచ్చే సినిమాలకు 50 శాతం సబ్సిడీని ఇవ్వాలని, ప్రభుత్వమే బ్యాంకు గ్యారంటీలను ఇప్పించి ప్రొత్సహించాలన్నారు. పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు, తినుబండారాలపై అధిక రేట్లను వసూలు చేయడాన్ని ప్రభుత్వం నియత్రించాలన్నారు. ఆంధ్రా సినిమాలకు ఇచ్చిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రభుత్వం రద్దు చేసి, తెలంగాణ వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ సినిమా వేదిక గౌరవ అధ్యక్షులు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మోహన్ బైరాగి, చల్లాశ్రీనివాస్ రావు, సురేశ్‌రెడ్డి, సుజీ, అంజలీ, శ్రవణ్ గౌడ్, తుల్జా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.