Chiranjeevi | దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చిరుకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్ కూడా చిరంజీవికి అభినందనలు తెలిపాడు.
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సోమవారం నాడు కేఎస్ భరత్ వెళ్లాడు. తన టెస్ట్ జెర్సీని అందించి అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఇప్పటికే చిరంజీవి దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, వశిష్ఠ, మారుతి, శ్రీకాంత్ ఓదెల నిర్మాతలు దిల్ రాజు, ఎస్.రాధాకృష్ణ(చినబాబు ), తదితరులు మెగాస్టార్‌ను కలిసి విషెస్ చెప్పారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్నాడు. సోషియో ఫాంటసీ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమాకు బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్ నడుస్తోంది. అనుష్క, మృణాల్ ఠాకూర్‌ను ఇప్పటికే ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.