ఓటీటీ వచ్చిన తర్వాత నిర్మాతలకు మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. చిన్న, మధ్యస్థాయి సినిమాలు కూడా ఓటీటీ పుణ్యమా అని డబ్బులు రాబట్టుకుంటున్నాయి. ఇక, కొన్ని సినిమాలు అయితే నేరుగా ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారుతున్నాయని చెప్పుకొచ్చింది తాప్సీ పన్ను. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కొన్ని ఇంతకుముందులా అన్ని సినిమాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నది.
‘స్టార్ నటీనటులు లేకపోయినా, బాక్సాఫీస్ దగ్గర అంతగా కలెక్షన్లు రాకపోయినా.. ఓటీటీ ఉందన్న ధైర్యం నిర్మాతలకు ఉండేది. అయితే, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యూటర్న్ తీసుకుంటున్నాయి. ప్రతి సినిమాను కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేయలేమని చెబుతున్నాయి. స్టార్ నటులు లేని సినిమాలను ప్రమోట్ చేయలేమని చేతులు ఎత్తేస్తున్నాయి.
చిన్న సినిమాలను ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చూసేలా ఆకర్షించడం కష్టమని అంటున్నాయి. ఎంతో కొంత ప్రమోషన్ చేసి థియేటర్లలో విడుదల చేయాలని, ఆ తర్వాత కొన్నిరోజులకు ఆ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకుంటామని స్పష్టంగా చెప్పేస్తున్నాయి’ అని చెప్పుకొచ్చారు తాప్సీ.