హైదరాబాద్: సినీ పరిశ్రమ కోటను కోల్పోయిందని ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి (Tanikella Bharani) అన్నారు. ఆయన అనుకున్నది సాధించారని చెప్పారు. కోట లేని లోటును ఎవరూ పూడ్చలేరని తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడతున్న సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిలిమ్నగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన భౌతికకాయానికి తనికెళ్ల భరణి నివాళుర్పించారు. అనంతరం మాట్లాడుతూ తామిద్దరిది 50 ఏండ్ల సహచర్యం అన్నారు. కోట శ్రీనివాసరావు తాను అనుకున్నది సాధించారని చెప్పారు. ఆయన కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు.
కోట లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని వెల్లడించారు. ఆయనతో కలిసి అనేక నాటకాలు చేశానని గుర్తుచేసుకున్నారు. తపన, నిబద్ధతతో పనిచేశారని తెలిపారు. కోట శ్రీనివాసరావు సినీ ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగిందన్నారు. యావత్ భారతదేశం ఆయనను గుర్తించిందని చెప్పారు. పరమేశ్వరుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.