Kangana vs Alagiri | ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కేఎస్ అళగిరి వివాదాస్పద వ్యాఖలు చేశారు. బీజేపీ ఎంపీ దక్షిణాదికి వస్తే చెంపదెబ్బ కొట్టాలని అళగిరి అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. అయితే, రూ.100 చెల్లిస్తే మహిళా కార్యకర్తలను నిరసనల్లోనే పాల్గొనేందుకు నియమించుకోవచ్చంటూ కంగనా గతంలో చేసిన ప్రకటనపై అళగిరి స్పందించారు. ఈ సందర్భంగా మండి ఎంపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ అహంకారంతో మాట్లాడుతుందని విమర్శించారు. ఆమె దక్షిణాది రాష్ట్రాల సందర్శనకు వస్తే.. అదే సమయంలో ఆమెను చెంపదెబ్బ కొట్టాల్సిందేంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన గతంలో ఇలాంటి వ్యాఖ్యలు కంగనా గతంలో చేసిందని గుర్తు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఓ మహిళా సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను చెంపదెబ్బ కొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల ఉద్యమాన్ని ఉద్దేశించి కంగనా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చెంపదెబ్బ కొట్టిందని.. అవమానించే వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా ఆగ్రహం వస్తుందని అళగిరి తెలిపారు. ఈసారి దక్షిణాదికి వస్తే మరిచిపోకుండా కంగనాను చెంపదెబ్బ కొట్టాల్సిందేనని.. అప్పుడే ఆమెకు తప్పు తెలిసివస్తుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
అళగిరి చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ స్పందించింది. భారత్‌లో ఎక్కడికైనా వెళ్లవచ్చని.. ఎవరూ ఆపలేరన్నారు. ద్వేషించే వారు కొందరుంటే.. ప్రేమించే వారు చాలా మందే ఉన్నారన్నారు. వరద బాధితులను కలిసేందుకు వెళ్లిన ఆమె ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. అళగిరి వ్యాఖ్యలపై స్పందించారు. తమిళనాడు సీఎం తలైవి జయలలిత పాత్రను సినిమాలో పోషించానని.. కానీ ఓటింగ్ సమయంలో సభలో ఉన్న ప్రతిపక్ష ఎంపీలు కూడా వరుసలో వెళ్తుండగా.. తనను తలైవి అని సంబోధించారన్నారు. మహిళలపై ఇలాంటి అగౌరవకరమైన వ్యాఖ్యలు చేయకూడదని.. ఇది ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపుతుందన్నారు. ఇదిలా ఉండగా.. కులు జిల్లాలోని మనాలి సబ్ డివిజన్లోని సోలాంగ్, పాల్చన్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇక్కడ తన రెస్టారెంట్ ఉందని.. ఇక్కడ కేవలం రూ.50 వ్యాపారం మాత్రమే జరిగిందని.. రూ.15లక్షలు జీతాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. బియాస్ నది ఉప్పొంగుతున్నందున సోలాంగ్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఎంపీకి తెలిపారు. నది మార్గాన్ని మళ్లించడానికి నీటిని కాలువ ద్వారా మళ్లించడం తక్షణ పరిష్కారమని సూచించారు.