ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి చెక్‌బౌన్స్ కేసులో చెన్నై న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..లింగుస్వామి కేవలం దర్శకత్వమే కాకుండా తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ పతాకంపై సినీ నిర్మాణం చేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం కార్తి, సమంత జంటగా లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ ఓ సినిమాకు సన్నాహాలు చేశారు.
ఇందుకోసం పీవీపీ సినిమాస్ సంస్థ నుంచి అప్పు తీసుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్‌మీదకు రాలేదు. పీవీపీ సంస్థ దగ్గర తీసుకున్న అప్పును లింగుస్వామి చెక్ ద్వారా చెల్లించారు. అది బౌన్స్ కావడంతో పీవీపీ సినిమాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సోమవారం కేసును విచారించిన చెన్త్నెలోని సైదాపేట్ న్యాయస్థానం లింగుస్వామికి ఆరు నెలల జైలుశిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు లింగుస్వామి తెలిపారు. రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వం వహించిన ‘ది వారియర్’ చిత్రం గత నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.