సినిమా పేరు: ఓదెల 2
తారాగణం: తమన్నా, హెబ్బాపటేల్, వశిష్ట ఎన్.సింహా..
దర్శకత్వం: అశోక్‌తేజ
దర్శకత్వ పర్యవేక్షణ: సంపత్ నంది
నిర్మాత: డి.మధు
ఓటీటీ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ వస్తుంది అనగానే ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. శివశక్తిగా తమన్నా లుక్ విడుదల చేసినప్పట్నుంచీ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. దర్శకుడు సంపత్‌నంది రచన అందించడంతోపాటు ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగం అవ్వడం, ‘కాంతారా’ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్నందించడం మరీ ముఖ్యంగా నిర్మాత మధు చేసిన ప్రమోషన్స్ సినిమాకు మంచి బజ్‌ని తీసుకొచ్చాయి. మరి అందరి అంచనాలనూ ‘ఓదెల 2’ అందుకుందా? తొలిపార్ట్ విజయాన్ని ఈ మలిపార్ట్ కూడా కొనసాగించిందా? అనే విషయాలు తెలియాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ:
ఊళ్లో ఆడవాళ్ల ఉసురు పోసుకుంటున్నాడన్న విషయం తెలిసి, భర్త తిరుపతి(వశిష్ట ఎన్.సింహా)ని భార్య రాధ(హెబ్బాపటేల్) నరికి చంపి అతని తలతోపాటు పోలీస్టేషన్‌కి వెళ్లి లొంగిపోవడంతో ‘ఓదెల రైల్వేస్టేషన్’ కథ ముగిసింది. రాధ జైలుకు వెళ్లింది. తిరుపతి శవానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. బాడీని ఇంట్లోవారికి అందజేశారు. తిరుపతి శవాన్ని ఊళ్లోకి తీసుకొచ్చారు. ఊళ్లోజనం ఉసురు పోసుకున్నాడన్న కసితో ఊళ్లోవారెవరూ తిరుపతి శవాన్ని చూడ్డానికి కూడా రాలేదు. సరికదా.. అతని ఆత్మని కూడా శిక్షించాలని నిర్ణయించుకుంటారు. ఊరి పూజారి సలహా మేరకు అతని శవాన్ని నిలువనా నిలబెట్టి, అతని శరీరాన్ని కోడి నెత్తురుతో తడిపి, ఊళ్లో జనం గోళ్లు మూటగట్టి.. ఆ మూటతో సహా అతన్ని పాతిపెడతారు. అలా నిలువునా పాతిపెడితే అతని ఆత్మకు శాంతి క్షోభకు గురి అవుతుందని వారి నమ్మకం. ఊరి జనం చేసిన పనివల్ల తిరుపతి ఆత్మ నిజంగానే క్షోభ చెందుతుంది. ఆ బాధ కాస్తా పగగా మారుతుంది. తను దెయ్యంగా మారతాడు. ఊర్లో కొత్తగా పెళ్లయిన జంటల్నీ టార్గెట్ చేసి, భయంకరంగా చంపతుంటాడు. వేరేవాళ్ల శరీరాల్లోకి ప్రవేశించి వారి ద్వారా తన కార్యాన్ని పూర్తి చేస్తుంటాడు. ఈ చర్యలవల్ల అమాయకులు బలైపోతుంటారు. అలాంటి సమయంలో తరుణోపాయం కోసం ఊరిజనం జైల్లో ఉన్న రాధను కలుస్తారు. ‘వాడ్ని చంపింది నువ్వే. ఇప్పుడు కాపాడాల్సింది నువ్వే’ అని ప్రాధేయపడటంతో రాధ తన అక్క భైరవి(తమన్నా) గురించి ఊరు జనాలకు చెబుతుంది. ఈ దెయ్యం ఆటకట్టించే శక్తి భైరవికి మాత్రమే ఉందని రాధ ఊరి జనాలకు చెప్పడంతో ఊరిజనం భైరవిని వెతికే ప్రయత్నాలు మొదలుపెడతారు. తన జీవితాన్ని శివుడికే అంకితం చేసిన నాగసాధు భైరవి. మరి భైరవిని ఊరుజనం ఎలా చేరారు? ఊరికి పట్టిన పీడను భైరవి ఎలా వదిలించింది? ఈ క్రమంలో క్షుద్రశక్తితో భైరవి చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
సూపర్ నాచురల్ థ్రిల్లర్ సినిమాలంటే లాజిక్కులు వెతకనక్కర్లా. సినిమాను ఆసక్తికరంగా తీస్తే చాలు సినిమా హిట్. గతంలో చాలా సినిమాలు అందుకు ఉదాహరణ. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇందులో కొత్తదనం ఏమాత్రం లేదు. రచయిత, దర్శకత్వపర్యవేక్షకుడైన సంపత్‌నంది చెప్పినట్టు ‘ఆత్మ వర్సెస్ పరమాత్మ’ అంతే ఈ సినిమా. ఈ పాయింట్‌తో తెలుగుతెరపై లెక్కకు మించిన కథలొచ్చాయి. విజయాలను కూడా అందుకున్నాయి. ఇలాంటి సినిమాల్లో ైక్లెమాక్స్ ఏంటో ఆడియన్స్‌కి తెలుసు. ఆ తెలిసిన విషయాన్ని కొత్తగా చూపిస్తే సినిమా గట్టెక్కినట్టే. ఈ విషయంలో దర్శకుడు అశోక్‌తేజా కొంతమేర సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ షాట్ నుంచే కథపై ఆసక్తిని కలిగించాడు. ప్రధమార్ధం అంతా ‘అరుంధతి’ సినిమాను గుర్తు చేస్తుంది. అందులో పశుపతిని అరుంధతి సమాధి చేసినట్టుగానే ఇందులో తిరుపతిని ఊరిజనం సమాధి చేస్తారు. అందులో పశుపతి ఉగ్రభూతంగా మారినట్టుగానే ఇందులోనూ తిరుపతి దెయ్యంగా మారతాడు. అందులో షయాజీ షిండే పాత్రను గుర్తు చేసేలా ఇందులో మురళీశర్మ పాత్ర కనిపించింది. భైరవి పాత్ర ఎంటరైనప్పట్నుంచీ కథ మరోమలుపు తీసుకుంది. అక్కడ్నుంచీ తిరుపతి ఆత్మ, భైరవి మధ్య జరిగే సంఘటనలు ఆడియన్స్‌కి గూజ్బంప్స్ తెప్పిస్తాయి. ఓ దశలో తిరుపతి ఆత్మను భైరవి ప్రతిఘటించలేని పరిస్థితి రావడం, తిరుపతి ఆత్మ విశృఖలత్వం.. ఇవన్నీ ఉత్కంఠకు గురిచేస్తాయి. అయితే.. పతాక సన్నివేశం మాత్రం అనుకున్న స్థాయిలో అనిపించలేదని చెప్పొచ్చు.
నటీనటులు
ఇందులో దెయ్యంగా మారిన తిరుపతి పాత్రను వశిష్ట.ఎన్.సింహా నటించాడు. ‘అరుంధతి’లో పశుపతి స్థాయిలో ఆ పాత్రను సంపత్ నంది డిజైన్ చేశారు. ఆ స్థాయి పర్ఫార్మెన్స్ని మాత్రం వశిష్ట.ఎన్.సింహా ఇవ్వలేకపోయాడని చెప్పొచ్చు. అయితే.. తన స్థాయికి గొప్పగానే నటించాడు. నాగసాధు భైరవిగా తమన్నా చాలా బాగా నటించింది. ఆమె పాత్రను లేడీ అఖండ అనొచ్చు. ఓ విధంగా ‘అఖండ’లో బాలకృష్ణ పాత్రను ప్రేరణగా తీసుకొని ఆ పాత్రను డిజైన్ చేశారా అనిపిస్తుంది. కొన్ని సంభాషణలు కూడా ‘అఖండ’ను గుర్తుకు తెస్తాయి. తమన్నా కూడా చాలా కష్టపడి నటించింది. ఆమె ఆహార్యం కూడా బావుంది. హెబ్బా పటేల్ అభినయానికి ఆస్కారమున్న మంచి పాత్ర చేసింది. ఉన్నంతలో తను కూడా బాగా చేసింది. మిగతా నటీనటులంతా పరిధిమేర తమ పాత్రకు రక్తికట్టించారు.
సాంకేతికంగా..
సంపత్‌నంది రాసుకుంది పాత కథే. కథనం మాత్రం బావుంది. సంభాషణలు కూడా బాగా రాసుకున్నారు. దర్శకుడు ైక్లెమాక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బావుండేది అనిపించింది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం నేపథ్యసంగీతం బావుంది. పాటలైతే అంత గొప్పగా ఏం లేవ్. కెమెరా వర్క్, ఎడిటింగ్ కూడా బావుంది. మొత్తం సూపర్ నాచురల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు ‘ఓదెల 2’ నచ్చొచ్చు.
బలాలు: కథనం, తమన్నా యాక్టింగ్, అజనీష్ నేపథ్యసంగీతం..
బలహీనతలు: కథ, ైక్లెమాక్స్, పాటలు
రేటింగ్: 3/ 5