Ilayaraja | తమిళ సంగీత సారథి ఇళయరాజా పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. సినిమా సంగీతంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజానికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా ప్రతిపాదించనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. చెన్నైలో శనివారం నిర్వహించిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ ఈ ప్రకటన చేశారు. ఈ వేడుకలో ఇళయరాజా సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ, కృషి, నైపుణ్యాలు ఉంటే ఏమైనా సాధ్యమవుతుందని ఇళయరాజా నిరూపించారు. సంగీతం ఆయనకు తల్లి. భావోద్వేగాలను ప్రేరేపించే ఆయుధం. ఆయన సేవలను గుర్తించి, భారతరత్నకు ప్రతిపాదిస్తున్నాం అని తెలిపారు. అంతేకాదు, ఇళయరాజా పేరు మీదుగా ప్రతి సంవత్సరం సంగీత కళాకారులకు ప్రత్యేక పురస్కారం అందించనున్నట్లు కూడా స్టాలిన్ ప్రకటించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రి సామినాథన్, సినీ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు పాల్గొన్నారు. స్టేజ్ పై ఇళయరాజా గురించి పలువురు ప్రముఖులు తమ అనుభవాలను పంచుకుంటూ, ఆయన సంగీత ప్రయాణాన్ని కొనియాడారు.
1943లో తమిళనాడులోని పన్నైపురంలో పుట్టిన ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. బాల్యంలోనే జానపద గీతాలపై ఆసక్తి పెంచుకొని గ్రామీణ నాటకాలలో పాడుతూ తన సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 1976లో ‘అన్నకిళి’ సినిమాతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన, పాశ్చాత్య సంగీతం, కర్ణాటక సంగీతం, జానపద గీతాలను మిళితం చేసి వినూత్న శైలిని అందించారు. రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో సింఫనీ రికార్డ్ చేసిన తొలి ఆసియా సంగీత దర్శకుడు. ఇప్పటివరకు 5 నేషనల్ అవార్డులు అందుకున్నారు. 2010లో పద్మ భూషణ్, 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కించుకున్నారు. 1,000కు పైగా సినిమాలకు సంగీతం అందించిన ఘనత ఆయనది