గత కొంతకాలంగా హిందీ చిత్రసీమకే పరిమితమైంది సీనియర్ కథానాయిక టబు. సినిమాల విషయంలో సెలెక్టివ్‌గా ఉంటూ వినూత్న కథాంశాల్లో నటిస్తున్నది. ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఆమె మరే తెలుగు సినిమాలో నటించలేదు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత టబు తెలుగు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వనుంది. వివరాల్లోకి వెళితే.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రకటన వెలువడింది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని జూన్‌లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇందులో టబు కీలక పాత్రలో నటించనున్నట్లు గురువారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కథాగమనంలో ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు.
విజయ్ సేతుపతిని మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పంథాలో ఆవిష్కరిస్తూ దర్శకుడు పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని, ఈ కథ విన్న వెంటనే టబు సినిమాలో నటించేందుకు అంగీకరించిందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మికౌర్, రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్.