Taapsee Pannu | వివాహానంతరం కూడా నటిగా బిజీబిజీగా ఉన్నది ఢిల్లీభామ తాప్సీ పన్ను. ఆమె నటించిన ఫిర్ ఆయీ హసీనా దిల్రుబా, ఖేల్ ఖేల్ మే చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నది తాప్సీ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన పెళ్లి గురించి, తన భర్త మథియాస్ బో గురించి ఆసక్తికరంగా మాట్లాడింది తాప్సీ.
‘నా భర్త పేరెన్నికగన్న వ్యాపారవేత్తకాదు. అలాగే స్టార్ క్రికెటర్ కూడా కాదు. అందుకే ఆయన గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోరు. చాలామందికి తెలీని విషయం ఏంటంటే.. ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అపూర్వ విజయాలను అందుకున్న బ్యాడ్మింటన్ ప్లేయర్. కొన్ని రంగాల వల్ల కొందరు లైమ్‌లైట్‌లో ఉంటారు. సినిమా వాళ్లను, క్రికెటర్లను సమాజం స్టార్లుగా చూస్తుంది.
బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు అంత గ్లామర్ ఉండదు. ఇది నిజంగా బాధాకరం. కానీ నేను మాత్రం ఓ అంతర్జాతీయ ఆటగాడి భార్యగా ఎప్పుడూ గర్విస్తా’ అని చెప్పుకొచ్చింది తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ గత తొమ్మిదేళ్లుగా రిలేషన్లో ఉంది. ఈ ఏడాది మార్చి 23న ఈ జంట పెళ్లితో ఒకటైంది. ఉదయ్‌పూర్ వేదికగా బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగిన విషయం తెలిసిందే.