అమితాబచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్ సెన్సేషన్ ‘పింక్’ సినిమా విడుదలై సెప్టెంబర్ 16కి సరిగ్గా ఎనిమిదేండ్లు. ఈ సందర్భంగా నాటి సంగతులను నటి తాప్సీ గుర్తు చేసుకున్నది. ‘భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప సినిమాల్లో ‘పింక్’ ఒకటిగా నిలుస్తుంది. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆ స్థాయిని మేం ఊహించలేదు. అలాంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు ఇప్పటికీ గర్వంగా ఫీలవుతా.
అయితే.. ఏ సమస్యను ప్రశ్నిస్తూ ఎనిమిదేండ్ల క్రితం ఆ సినిమా చేశామో.. ఆ సమస్య ఇప్పటికీ అలాగే ఉంది. ఇంకా మాట్లాడితే ఇంకా జటిలమైంది. స్త్రీలకు సమాజంలో ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ఈ సినిమాలో నటించిన అందరికీ ఆ బాధ ఉంది.’ అంటూ చెప్పుకొచ్చింది. 2016లో విడుదలైన ‘పింక్’ సినిమా భారీ వసూళ్లతో పాటు, ఎన్నో పురస్కారాలను కూడా చేజిక్కించుకున్నది. ‘బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూస్’ కేటగిరిలో జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నది.