పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ సినిమాపై మామూలుగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలవుతున్న ప్రచార చిత్రాలు సినిమాపై ఉన్న అంచనాలను అంతకంతకూ పెంచేస్తున్నాయి. మొన్నామధ్య విడుదలైన తొలి పాటైతే వ్యూస్‌లో రికార్డులను సృష్టించింది. తాజాగా వినాయకచవితి సందర్భంగా రెండో గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. ‘సువ్వీ .. సువ్వీ..’ అంటూ మొదలయ్యే ఈ పాట.. తొలిపాటకు పూర్తి భిన్నంగా రొమాంటిక్ మెలొడీగా సాగింది.
‘ఉండిపోవ.. ఉండిపో ఇలాగా.. తోడుగా నా మూడుముళ్లలాగా.. నిండిపోవ నీడలాగ నీ లాగా..’ అంటూ నాయకానాయికల ప్రేమబంధాన్ని, లోతైన ఆత్మీయతనూ ఆవిష్కరించేలా కల్యాణచక్రవర్తి త్రిపురనేని ఈ పాటను రాయగా, తమన్ శ్రావ్యంగా స్వరపరిచారు. శృతి రంజని మధురంగా ఆలపించారు. పవన్‌కల్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్‌లపై కలర్ఫుల్గా ఈ పాటను దర్శకుడు సుజిత్ తెరకెక్కించారు. మాఫియా డాన్‌గా పవన్‌కల్యాణ్ నటిస్తున్న ఈ మాస్ ఎంటైర్టెనర్ వచ్చే నెల 25న విడుదల కానుంది. ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్‌రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి కె.చంద్రన్, మనోజ్ పరమహంస, నిర్మాతలు: డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి, నిర్మాణం: డీవీవీ ఎంటర్టైన్మెంట్స్.