‘కంగువ’ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భార్య జ్యోతిక గురించి, తమ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సూర్య. ‘ జ్యోతిక తొలి సినిమా ‘డోలీ సజా కే రఖ్నా’. ఆ సినిమా తర్వాత తను నాతోనే చేసింది. సినిమా పేరు ‘పూవెల్లం కెట్టుప్పర్’. తనకది రెండో సినిమా. నాకది అయిదో సినిమా. తొలిరోజులు కాబట్టి లొకేషన్లో కాస్త భయంభయంగా ఉండేవాడ్ని. జ్యోతిక అలాకాదు. తను ఫైర్. భయం అనేది తనకు తెలీదు.
తమిళంలో తనకది తొలి సినిమానే అయినా డైలాగులు స్పష్టంగా చెప్పేసేది. ఆ సినిమా టైమ్‌లోనే ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. తర్వాత తను పెద్ద స్టార్‌గా ఎదిగింది. నాకు ‘కాక్కా కాక్కా’తో బ్రేక్ వచ్చింది. ఆ టైమ్‌కి జ్యోతిక పెద్ద స్టార్. ‘కాక్కా కాక్కా’లో నాతో చేయడానికి నాకంటే మూడురెట్లు ఎక్కువ పారితోషికం తీసుకుంది. కెరీర్ పరంగా ఆమెతో పోలిస్తే అప్పటికి నా రేంజ్ చాలా తక్కువ. అయినా.. నాతో జీవితాన్ని పంచుకోడానికి సిద్ధపడింది.’ అంటూ గతాన్ని నెమరువేసుకున్నారు సూర్య.