ముంబై మాఫియా సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ జీవిత కథ ఆధారంగా గతంలో చాలా సినిమాలొచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్లో రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘అబ్తక్ చప్పన్’ సినిమా దయానాయక్ జీవితానికి అద్దం పట్టింది. అదే సినిమా తెలుగులో జేడీ చక్రవర్తి దర్శకత్వంలో ‘సిద్ధం’గా పునర్నిర్మితమైంది. గోపీచంద్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘గోలీమార్’ సినిమాక్కూడా ఓ విధంగా దయా నాయక్ జీవితమే ప్రేరణ.
కన్నడంలోనూ ‘ఎన్కౌంటర్ దయా నాయక్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. దయా నాయక్ జీవితం ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ విజయాలను సాధించడం విశేషం. త్వరలో దయా నాయక్ జీవితంలోని ఓ కీలకభాగాన్ని సినిమాగా తెచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నదని సమాచారం.
‘సింగం’ ఫ్రాంచైజీతో పోలీస్‌గా తిరుగులేని గుర్తింపును సాధించిన సూర్య ఇందులో దయా నాయక్‌గా కనిపించనున్నట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది. సూర్య 47వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాకు మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తారట. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.