బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలిని ముంబై సీబీఐ కోర్టు నిర్దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది. సూరజ్ మానసికంగా హింసించడం వల్లే జియా ఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందనడానికి ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని కోర్టు అభిప్రాయపడింది. 2013 జూన్ 3న జియా ఖాన్ ముంబయిలోని తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బాలీవుడ్ చిత్రసీమలో మంచి అవకాశాలతో ఎదుగుతున్న జియాఖాన్ అర్థాంతరంగా తనువు చాలించడం ప్రతి ఒక్కరిని కలచివేసింది.
తన ఆత్మహత్యకు ప్రియుడు సూరజ్ పంచోలినే కారణమంటూ జియాఖాన్ రాసిన ఆరు పేజీల లేఖ సంచలనం సృష్టించింది. సూరజ్‌తో సహజీవన బంధంలో తలెత్తిన మనస్పర్థల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు జియాఖాన్ లేఖలో పేర్కొంది. తన కూతురు ఆత్మహత్యకు కారణమైన సూరజ్‌కు శిక్షపడేలా చేయాలంటూ జియాఖాన్ తల్లి రబియా పదేళ్లుగా పోరాటం చేస్తున్నది. తాజా తీర్పుతో ఆమె తీవ్ర ఆవేదనకులోనయ్యారు. రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘నిశ్శబ్ద్’ చిత్రంతో జియాఖాన్ నటిగా పరిచయమైంది. ‘గజినీ’ చిత్రంలో రెండో నాయికగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.