Sundarakanda | యువ కథానాయకుడు నారా రోహిత్ (Nara Rohith) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సుందరకాండ’ (Sundarakanda). ఈ సినిమాకు వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా.. అలనాటి నటి శ్రీదేవి విజయ్‌కుమార్, వ్రితి వాఘని హీరోయిన్లుగా నటించారు. మిడిల్ ఏజ్‌కి వచ్చి యువకుడికి పెళ్లి కష్టాలంటే ఎలా ఉంటాయో అనే కథ ఆధారంగా ఈ చిత్రం రాగా.. వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడూ ఈ చిత్రం తాజాగా ఓటీటీని లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ చిత్రం సెప్టెంబర్ 23 నుంచి తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సిద్ధార్థ్ (నారా రోహిత్) వయసు ముప్ఫై దాటింది అయిన కూడా పెళ్లి కాని ప్రసాద్‌లా మిగిలిపోతాడు. సిద్ధార్థ్ పెళ్లి కాకపోవడానికి కారణం, తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఉండాల్సిన ఐదు లక్షణాల గురించి పెట్టుకున్న కొన్ని రూల్స్. తనకు వచ్చిన ప్రతి పెళ్లి సంబంధాన్ని ఈ రూల్స్ సాకుతోనే చెడగొడుతుంటాడు. నిజానికి ఈ ఐదు లక్షణాలకు కారణం తన స్కూల్ సీనియర్ అయిన వైష్ణవి (శ్రీదేవి విజయ్ కుమార్). వాళ్ళిద్దరి ప్రేమ కథ మధ్యలో ఎవరి వల్ల బ్రేక్ పడింది అనేదే ఒక కథ. ఇక, ఎయిర్ పోర్టులో పరిచయం అయిన ఐరా (వృతి వాఘాని)లో తను కోరుకున్న ఆ ఐదు లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఆ అమ్మాయి ఇంకా చదువుకుంటోంది. అమెరికా వెళ్ళబోతున్న ఐరా కోసం, సిద్ధార్థ్ ఒక కాలేజీలో లెక్చరర్ గా చేరతాడు. తర్వాత సిద్ధార్థ్ ను ఐరా ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరి పెళ్లికి వయసులో ఉన్న వ్యత్యాసం కాకుండా మరో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే రెండో కథ. అయితే ఈ వైష్ణవి, ఐరా కథలు ఎలా కలిశాయి? సిద్ధూ పెళ్లికి వచ్చిన అడ్డంకులు ఏమిటి? సిద్ధార్థ్ తల్లిదండ్రులు (నరేష్, రూప లక్ష్మి), అక్క (వాసుకి) ఇంకా స్నేహితులు (సత్య, సునైనా, అభినవ్ గోమఠం) అతనికి ఎలా సహాయం చేశారు? చివరకు సిద్ధార్థ్ కు పెళ్లి అవుతుందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.