‘ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడి కథ ఇది. హైదరాబాద్ నేపథ్యంలో ప్రేమ, వినోదం, ఉత్కంఠ ప్రధానంగా ఆకట్టుకుంటుంది’ అన్నారు సుమంత్ప్రభాస్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రోమాంచకం’. అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకుడు. ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాత. నేడు ప్రేక్షకులముందుకొస్తున్నది. బుధవారం హీరో సుమంత్ప్రభాస్ విలేకరులతో ముచ్చటించారు. ఈ సినిమా కోసం టీమంతా ఆర్నెళ్లపాటు వర్క్‌షాప్ చేశామని, కొన్నిసార్లు ఒకే సీన్ నెల పాటు ప్రాక్టీస్ చేసిన సందర్భాలున్నాయని, దాంతో నటనలో మరింత పర్ఫెక్షన్ వచ్చిందని అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా నవ్వుకునే సినిమా ఇది. సందీప్ అన్న ఓ అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు ‘ఓ క్యూట్ స్టోరీ ఉంది. వింటే బాగుంటుంది’ అన్నాడు.
ఆయన చెప్పిండంటే తప్పకుండా బాగుంటుందని ఫిక్సై పోయా. దర్శకుడు వేణు అన్న ఈ కథ చెప్పినప్పుడు రెండున్నర గంటల నరేషన్లో పూర్తిగా నవ్వుతూనే ఉన్నా’ అని సుమంత్ప్రభాస్ చెప్పారు. విజయ్‌దేవరకొండ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చి తన గురించి మాట్లాడటం సంతోషాన్నిచ్చిందని, ఆయన్ని చూసి ఎప్పుడూ ఇన్స్పైర్ అవుతుంటానని అన్నారు. ‘ప్రేక్షకులకు కొత్తగా అనిపించాలని ‘రోమాంచకం’ అనే టైటిల్ పెట్టాం. ఇప్పుడు యూత్‌లో అదొక ఊతపదంలా మారిపోయింది. టైటిల్ మాదిరిగానే ఈ సినిమా ఆద్యంతం రోమాంచితమైన ఫీల్‌తో సాగుతుంది. హీరోగా అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. ప్రస్తుతం ప్రేమకథలు చేస్తున్నా. కొంచెం పేరొచ్చాక యాక్షన్, కమర్షియల్ సినిమాలు చేయాలనుకుంటున్నా. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ సాయిలు కంపాటితో ఓ సినిమా చేయబోతున్నా. ఈ నెలలోనే ప్రారంభమవుతుంది’ అని సుమంత్ప్రభాస్ పేర్కొన్నారు.