సుకుమార్ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న విడుదల కానుంది. ‘పుష్ప’ విషయంలో ఓ యజ్ఞమే చేశారు సుకుమార్. దాదాపు అయిదేళ్లు ఈ ఫ్రాచైజీకే కేటాయించారాయన. ఎట్టకేలకు ‘పుష్ప 2’ వచ్చేస్తోంది. మరి సుకుమార్ తర్వాత సినిమా ఏంటి? ప్రస్తుతం సినీ అభిమానుల్లో నెలకొన్న ప్రశ్న ఇది. దానికి సమాధానం కూడా వచ్చేసింది. సుకుమార్ తర్వాతి సినిమా రామ్‌చరణ్‌తో ఉంటుందట. ‘RC17’ వర్కింగ్ టైటిల్‌తో మొదలయ్యే ఈ సినిమా కథకు సంబంధించిన కసరత్తులు కూడా మొదలయ్యాయని సమాచారం.
ఓ అద్భుతమైన పాయింట్‌తో సుకుమార్ ఈ కథను రెడీ చేస్తున్నారని తెలుస్తున్నది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇందులో హీరోయిన్గా సాయిపల్లవిని అనుకుంటున్నారట. త్వరలోనే ఆమెకు కథను కూడా వినిపించనున్నారట. సుకుమార్ సినిమాల్లో కథానాయికల పాత్రలు బలంగా ఉంటాయి. చరణ్‌తో చేయనున్న సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర కీలకంగా ఉంటుందట. అందుకే సాయిపల్లవి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.