‘పుష్ప 2’తో ఊహకందని విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ సుకుమార్. ఆయన నెక్ట్స్ సినిమా రామ్‌చరణ్‌తో ఉంటుందని అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ అంటే అంచనాలు మామూలుగా ఉండవ్. పైగా ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ నుంచి వచ్చే సినిమా కూడా ఇదే. ఈ ప్రాజెక్ట్ అయితే సెట్ అయ్యింది కానీ, కథైతే ఖరారు కాలేదు.
అందుకే తగిన కథ కోసం తన టీమ్‌తో కలిసి బ్యాంకాక్ వెళ్లిన సుకుమార్.. రీసెంట్గా తిరిగొచ్చారు. ఎట్టకేలకు కథపై ఓ స్పస్టత వచ్చినట్టు తెలుస్తున్నది. త్వరలోనే రామ్‌చరణ్‌కి కథ వినిపిస్తారని ఇన్సైడ్ టాక్. ఇక ఈ కథ విషయానికొస్తే.. ‘రంగస్థలం’ కంటే భిన్నమైన కథనే సుకుమార్ రెడీ చేశారట.
నిజానికి రామ్‌చరణ్‌తో ఓ చక్కటి ప్రేమకథ చేయాలనేది సుకుమార్ కోరిక. కానీ మారిన రామ్‌చరణ్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా యాక్షన్ డ్రామానే తయారు చేశారట. రామ్‌చరణ్‌తో ఓకే అనిపించుకున్నాక చకచకా పనులు మొదలుపెట్టేయాలనే ఆలోచనలో ఉన్నారట సుకుమార్.