Su From So Movie | కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని కేజీఎఫ్ ముందు కేజీఎఫ్ తర్వాత అని మాట్లాడుకుంటాం. అయితే కేజీఎఫ్ కంటే ముందు ఆ తర్వాత కూడా శాండల్‌వుడ్ ఇండస్ట్రీ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. అలానే వచ్చి ఎటువంటి భారీ అంచనాలు లేకుండా, చిన్న సినిమాగా విడుదలై కన్నడ చిత్రసీమలో సంచలనం సృష్టిస్తోంది ‘సు ఫ్రమ్ సో’ చిత్రం. జూలై 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ, విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటోంది. రాజ్ బి శెట్టి సహ-నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు జెపి తుమినాడ్ దర్శకత్వం వహించారు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం, వినూత్నమైన కథాంశంతో కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం కన్నడలో అరుదైన రికార్డును నమోదు చేసుకుంది.
కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.28 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అంతేగాకుండా కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం 3.80 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడై, ఒకే రోజులో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అత్యధిక టిక్కెట్లు అమ్ముడైన కన్నడ చిత్రంగా రికార్డు సృష్టించింది.