Sreeleela | ప్రస్తుతం తారాపథంలో దూసుకుపోతున్నది అచ్చ తెలుగు అందం శ్రీలీల. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అగ్ర నాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. యువతరంలో ఈ భామకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో ఆరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. బుధవారం ఈ ముద్దుగుమ్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె నటిస్తున్న తాజా చిత్రాల తాలూకు కొత్త లుక్స్‌ను విడుదల చేశారు. ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేష్‌బాబుతో జోడీ కడుతున్నది.
ఈ సినిమా కొత్త స్టిల్‌లో ఈ సొగసరి సంప్రదాయ లంగావోణిలో మెరిసిపోతున్నది. ఇక బాలకృష్ణ నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో కూడా చూడముచ్చమైన అందంతో ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రాలతో పాటు నితిన్-వక్కంతం వంశీ మూవీ, బోయపాటి శ్రీను-రామ్ కాంబో చిత్రం, ఉస్తాద్ భగత్‌సింగ్, ఆదికేశవ, చిత్రాల్లో శ్రీలీల నాయికగా నటిస్తున్నది.