తెలుగు సినీ నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు పరస్పరం సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని, అందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆ కమిటీ అన్ని పక్షాలతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని, బుధవారం నుంచి షూటింగ్స్ పునఃప్రారంభమవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వేతన పెంపును డిమాండ్ చేస్తూ తెలుగు సినీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం సినిమా నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో భేటీ అయ్యారు.
సినీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందని, పరిశ్రమలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని మంత్రి తెలిపారు. కార్మికులు తమ పనిని కొనసాగిస్తూనే డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి కృషి చేయాలని, షూటింగ్స్ నిలిపివేయడం సరైన మార్గం కాదని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలోని అన్ని పక్షాల మధ్య ఐక్యత అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను గ్లోబల్ ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సుప్రియ, జెమిని కిరణ్, దామోదరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.