సినీ పరిశ్రమలో పెద్దన్న పాత్రను పోషించిన దర్శకరత్న దాసరి నారాయణ రావు సేవలను చిరస్థాయిగా నిలుపుకునేందుకు కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు 76వ జయంతి సందర్భంగా హైదరాబాద్ మణికొండ చిత్రపురి కాలనీలో గురువారం ఆయన విగ్రహాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దర్శకుడిగా ఎన్నో ఆదర్శనీయమైన, ఎవరికీ సాధ్యంకాని విధంగా 150కి పైగా సినిమాలు తెరకెక్కించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మహనీయుడు దాసరి అని కొనియాడారు.
తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున సినిమాలకు నంది అవార్డులను అందజేసే విషయం గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఆయన జయంతి రోజున చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని చిత్రపురికాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి.కల్యాణ్, దామోదర ప్రసాద్, దర్శకులు ఎన్.శంకర్, రేలంగి నర్సింహారావు, దాసరి తనయుడు అరుణ్‌కుమార్, ఫిలిం చాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.