దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న ‘వారణాసి’ సినిమాపై అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈ సినిమా విడుదల కోసం కేవలం మహేశ్ అభిమానులే కాక, సగటు ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తన గత చిత్రాలకు భిన్నంగా శరవేగంగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే.. ఈ సినిమా కథ విషయంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది.
ఇదొక టైమ్ ట్రావెల్ మూవీ అన్న సంగతి తెలిసిందే. త్రేతాయుగం నుంచి కలియుగం వరుకూ ఈ ప్రయాణం నడుస్తుందట. ద్వాపరయుగంలో నీటిలో మునిగిపోయిన ద్వారక వృత్తాంతం కూడా ఈ కథలో భాగమేనని వినికిడి. ఇదిలావుంటే.. ఇందులో మహేష్ కొంత భాగం రాముడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్లో సంగ్రామఘట్టం హైలైట్‌గా నిలుస్తుందట.
రాజమౌళి విభిన్నంగా రామరావణ సంగ్రామాన్ని కాకుండా, రామ కుంభకర్ణ సంగ్రామాన్ని హైలైట్ చేశారని వినికిడి. కుంభకర్ణుడితో రాముడి పోరాటం ప్రేక్షకుల్ని రోమాంచితం చేస్తుందని తెలిసింది. ‘ఆర్ఆర్ఆర్’లో యాక్షన్ సీక్వెన్స్‌ని రాజమౌళి ఏ స్థాయిలో తెరకెక్కించారో అంతా చూశారు. వచ్చే ఏడాది రానున్న ‘వారణాసి’లో పోరాటాలు దానికి మించి ఉంటాయని సమాచారం.
ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ, కార్తీకేయ నిర్మిస్తున్న ఈ పానిండియా చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు.