ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్’ ఫ్రాంఛైజీ మూడోభాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌ను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని అగ్ర దర్శకుడు రాజమౌళి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాల్ ద్వారా కామెరూన్‌తో మాట్లాడారు.
ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందరికంటే ముందుగా ‘అవతార్-3’ని వీక్షించడం ఆనందంగా ఉందని, సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అదిరిపోయాయని రాజమౌళి అన్నారు. ఈ సందర్భంగా ‘వారణాసి’ సినిమా గురించి వాకబు చేశారు కామెరూన్. ‘వారణాసి’ సెట్‌కి రావొచ్చా అని రాజమౌళిని అడిగారు. సినిమా షూటింగ్, సెట్ చూడాలని ఉందని, అవసరమైతే కెమెరా పట్టుకొని తాను కూడా కొన్ని సీన్స్ తీస్తానని, అలాగే పులులతో ఏదైనా షూట్ ప్లాన్ చేస్తుంటే చెప్పాలని కామెరూన్ సరదాగా అనడంతో ఇద్దరి మధ్య నవ్వులు విరిశాయి.