శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 26, 2021 , 00:16:16

దసరాకు వస్తున్న రాంభీమ్‌

దసరాకు వస్తున్న రాంభీమ్‌

తొలితరం భారత స్వాతంత్య్ర పోరాటయోధులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల చారిత్రక నేపథ్యానికి కాల్పనిక ఘటనల్ని మేళవించి ప్రముఖ దర్శకుడు రాజమౌళి నిర్దేశకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘రౌద్రం రణం రుధిరం’. డి.వి.వి.దానయ్య నిర్మాత. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. పాన్‌ఇండియా స్థాయిలో దాదాపు నాలుగొందల కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. 

ఈ సందర్భంగా  సినిమా తాలూకు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్‌చరణ్‌ గుర్రపుస్వారీ చేస్తుండగా, ఎన్టీఆర్‌ బైక్‌రైడ్‌ చేస్తూ కనిపిస్తున్నారు. వీరిద్దరి రెట్రోలుక్‌ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో గోండు వీరుడు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్‌, మన్యం యోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. 

స్వాతంత్య్ర సంగ్రామంలో ఓ లక్ష్యం కోసం ఈ ఇద్దరు చారిత్రక వీరులు కలిసి ఎలాంటి పోరాటం చేశారన్నదే చిత్ర ఇతివృత్తం. నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ ‘చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. దసరాకు ప్రతి ఒక్కరూ సెలబ్రేట్‌ చేసుకునే గొప్ప సినిమా ఇది’ అన్నారు.  అలియాభట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గణ్‌, సముద్రఖని, హాలీవుడ్‌ నటుడు అలిసన్‌డూడీ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.

VIDEOS

logo