మహేశ్‌బాబుతో రూపొందిస్తున్న ‘వారణాసి’ చిత్రం ద్వారా దర్శకుడు రాజమౌళి సాంకేతికంగా భారతీయ సినిమాకు సరికొత్త ప్రమాణాలను నిర్ధేశించబోతున్నారని ఫిల్మ్‌వర్గాల్లో వినిపిస్తున్నది. సినిమా తాలూకు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునే విషయంలో రాజమౌళి ఎప్పుడూ ముందుంటారు. తాజా చిత్రం ‘వారణాసి’ ద్వారా ఆయన అడ్వాన్స్డ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని పరిచయం చేస్తున్నారట. 360 డిగ్రీ ప్రీ విజువలైజేషన్, రియల్ టైమ్ వర్చువల్ ప్రొడక్షన్ మరియు డిజిటల్ పర్ఫార్మెన్స్ వంటి అంశాల మేళవింపుతో ‘వారణాసి’ విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని చెబుతున్నారు.
అడ్వాన్స్డ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్ చేసిన 25 నిమిషాల నిడివిగల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందట. డిజిటల్ ఎఫెక్ట్స్, రియల్ యాక్షన్ కలబోతగా సృష్టించిన ఈ యాక్షన్ విజువల్స్ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయని చెబుతున్నారు. భారతీయ పురాణాలు, టైమ్ ట్రావెల్ కలబోసిన సాహస గాథగా అత్యంత భారీ వ్యయంతో ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.