అగ్ర దర్శకుడు రాజమౌళితో మహేష్‌బాబు ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ నేపథ్య కథాంశంతో హాలీవుడ్ స్థాయి సాంకేతిక హంగులతో రాజమౌళి ఈ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథనందిస్తున్నారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నదని తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి రూపొందించబోయే ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ అడ్వెంచర్ కథ కోసం పేరొందిన హాలీవుడ్ సాంకేతిక నిపుణుల్ని రంగంలోకి దించబోతున్నారు రాజమౌళి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు మహేష్‌బాబు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.