రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో పాన్ వరల్డ్ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళ్తుందోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జపాన్‌లో అక్కడి ప్రేక్షకులతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వీక్షించిన రాజమౌళి స్థానిక మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు సినిమాకు సంబంధించిన అప్డేట్ను అందించారు.
మహేష్‌బాబు చక్కటి ప్రతిభ కలిగిన నటుడని, హ్యాండ్సమ్గా ఉంటాడని రాజమౌళి కితాబిచ్చాడు. ‘మహేష్‌బాబుతో సినిమా చేయబోతున్నా. మీకు కూడా ఆయన గురించి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్‌ను ప్రారంభించి, సాధ్యమైనంత వేగంగా చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం’ అని రాజమౌళి తెలిపారు. తాజా అప్డేట్తో అభిమానులు సంబరపడిపోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మే నెలలో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకురానున్నారని తెలిసింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గత ఏడాది జపాన్‌లో విడుదలైంది. అక్కడ కూడా ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులను కలిసేందుకు రాజమౌళి ఇటీవల జపాన్‌కు వెళ్లారు.