మహేష్‌బాబుతో రాజమౌళి రూపొందిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ కథాంశం గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆఫ్రికన్ సఫారీ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు పాత్రని హనుమంతుడి స్ఫూర్తిగా తీర్చిదిద్దారని కూడా కథనాలొచ్చాయి. తాజాగా ఈ సినిమా మూడో షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నది. దక్షిణాఫ్రికా లేదా టాంజానియాలో మూడో షెడ్యూల్‌కు రంగం సిద్ధం చేశారని సమాచారం. ఇదిలావుండగా ఈ సినిమా కథాంశం గురించి ఓ హాలీవుడ్ పత్రిక ఆసక్తికరమైన వివరాల్ని వెల్లడించింది.
ఇండియానా జోన్స్‌తో పాటు ఆఫ్రికన్ అడ్వెంచర్ చిత్రాల నుంచి ప్రేరణ పొంది ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని, ఓ రహస్య ఛేదన కోసం బలమైన శత్రువుతో కథానాయకుడి పోరాటం, ఈ క్రమంలో చోటుచేసుకునే మిస్టీరియస్ ఇన్సిండెట్స్, అంతుచిక్కని రహస్యాల్ని వశపరచుకున్న అడవిలో హీరో చేసే ప్రయాణం, కథాగమనంలో పురాణాలకు సంబంధించిన వ్యాఖ్యానాలు… ఇవన్నీ ప్రేక్షకులకు అనుక్షణం ఉత్కంఠను పంచుతాయని సదరు పత్రిక తన కథనంలో పేర్కొంది. సాధారణంగా తన సినిమా కథల్ని ముందే చెప్పేస్తుంటారు రాజమౌళి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన ఇప్పటివరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. దీంతో ఈ కథ గురించి అందరిలో ఆసక్తి పెరిగింది. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అగ్ర తారలు ఈ సినిమాలో భాగమవుతున్న విషయం తెలిసిందే.