అగ్ర దర్శకుడు రాజమౌళి తన సినిమాలకు సంబంధించిన ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కారు. సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించాలని తపిస్తారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో ఆయన పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్స్ హైదరాబాద్, ఒడిస్సాలో పూర్తయ్యాయి. త్వరలో కథానుగుణంగా కెన్యాలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం కెన్యా షూట్‌ను రద్దు చేసుకున్నారని వార్తలొస్తున్నాయి.
అక్కడి రాజకీయ సంఘర్షణ కారణంగా షూటింగ్‌కు అవరోధాలు ఏర్పడొచ్చనే అనుమానంతో రాజమౌళి షూటింగ్‌ను క్యాన్సిల్ చేశారని అంటున్నారు. సౌత్ ఆఫ్రికా లేదా టాంజానియా వంటి దేశాల్లో ప్రత్యామ్నాయ లొకేషన్ల వేటలో చిత్రబృందం ఉందని చెబుతున్నారు. మరికొందరేమో స్క్రిప్ట్‌ను మరింత ఉన్నతీకరించేందుకు రాజమౌళి షూటింగ్‌కు గ్యాప్ తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో నిజమెంతో తెలియదు కానీ, సోషల్‌మీడియాలో మాత్రం బాగా ప్రచారం జరుగుతున్నది. యస్యస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.