Srikanth Iyengar | మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసాయి. “స్వాతంత్రం గాంధీ తీసుకురాలేదు” అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై విమర్శల వర్షం కురుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, గాంధీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు బల్మూరి వెంకట్ సీరియస్‌గా స్పందించారు. శ్రీకాంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ను కలిసి ఆయన సభ్యత్వం రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారం ప్రభావం శ్రీకాంత్ నటించిన సినిమాలపైనా పడుతోంది. ఇటీవల ఆయన నటించిన ‘అరి’ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కొన్ని ప్రాంతాల్లో థియేటర్ల ముందు నిరసనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా #BoycottSrikanthAyyangar అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇక వివాదం పెద్దదవుతుండటంతో, చివరికి శ్రీకాంత్ అయ్యంగార్ ఒక వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పారు. ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలో .. “నా వ్యాఖ్యలతో ఎంతో మంది బాధపడ్డారని తెలిసింది. వారందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. వారందరినీ గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ. భవిష్యత్తులో ఇలాంటి విషయాల వలన మన మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటాను. దేశ అభివృద్ధిలో మనమంతా కలసి ముందుకు సాగుదాం.” అని అన్నారు.
శ్రీకాంత్ అయ్యంగార్ చుట్టూ ఇలాంటి వివాదాలు కొత్తవి కావు. గతంలో కూడా ఆయన ఫిల్మ్ జర్నలిస్టులు, సినిమా రివ్యూ రైటర్లపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వారిని “బాత్రూమ్లోని క్రిముల కంటే నీచమైన వాళ్లు” అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. అలాగే జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. విజయవాడలో బూమ్ బూమ్ బీర్లపై వ్యంగ్యంగా వీడియో చేయడంతో వైసీపీ అభిమానులు కూడా ఆయనను ట్రోల్ చేశారు. ఇప్పుడేమో గాంధీజీపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో శ్రీకాంత్ మళ్లీ కేంద్రబిందువయ్యారు. ఆయన క్షమాపణలు చెప్పినా ఇప్పటికే జరిగిన నష్టం జరిగిపోయిందని సినీ వర్గాల అభిప్రాయం.