శ్రీకాంత్, లయ నాయకానాయికలుగా రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ మిడిల్క్లాస్’. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ట్రైలర్ను ఆవిష్కరించడంతో పాటు ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్, దశరథ్, రచయిత కోన వెంకట్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ .. మధ్యతరగతి కష్టాలను వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించారన్నారు.
ఇందులో నటించిన ప్రతీ ఆర్టిస్టుతో గతంలో తాను సినిమాలు చేశానని, మళ్లీ వారందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం పాత రోజులను గుర్తుకు తెచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తాను వెంకటేశ్వరస్వామి పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నానని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ బ్లాక్బస్టర్ హిట్ కొట్టబోతున్నారని, రాజేంద్రప్రసాద్ పాత్ర వెన్నెముకలా నిలిచిందని, ఆద్యంతం హాస్యభరితంగా సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.