జయాపజయాల సంగతి అటుంచితే.. మంచి నటిగా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొద్ది సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నది ఈ భామ. ఈ మధ్యకాలంలో విడుదలైన పరమ్ సుందరి, సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి సినిమాలు అనుకున్నంతగా ఆడకపోయినా.. జాన్వీకి మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టాయి.
రీసెంట్గా కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ యాక్షన్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది జాన్వీ. టైగర్ ష్రాఫ్, లక్ష్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో నటించేందుకు తానెందుకు ఒప్పుకున్నానో తెలుపుతూ ‘కేవలం రొమాంటిక్ పాత్రలే కాదు, ఏ జానర్ సినిమాలైనా చేయగలనని నిరూపించుకోడానికే ఈ సినిమాకు సైన్ చేశాను. ఇది యాక్షన్, రివైంజ్, ఇంటెన్స్ డ్రామా. ఇందులో నాది స్ట్రాంగ్ క్యారెక్టర్. ఎనర్జీ, ఎమోషన్, మరింత బలంగా చూపించే అవకాశం ఈ పాత్రలో ఉన్నది’ అని జాన్వీ తెలిపింది.