Venkatesh | తెలుగు సినీ చరిత్రలో కొందరు బాలనటులుగా ప్రయాణం ప్రారంభించి, ఆ తర్వాత అదే హీరోల సరసన కథానాయికలుగా కనిపించిన సంఘటనలు ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఉదాహరణకి, శ్రీదేవి. చిన్నప్పట్లో ఎన్టీఆర్ సినిమాల్లో ఆయన మనవరాలిగా కనిపించింది. ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా నటించి ప్రేక్షకుల్ని అలరించింది. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక తదుపరి తరం హీరోలలో వెంకటేష్‌కి కూతురిగా, ప్రియురాలిగా ఓ హీరోయిన్ నటించింది. ఆ హీరోయిన్ కూడా శ్రీదేవి కావడం విశేషం.
1972లో తమిళంలో విడుదలైన వసంత మాళిగై అనే చిత్రంలో శ్రీదేవి ఓ చిన్నపాప పాత్రలో నటించింది. ఇది 1971లో తెలుగులో వచ్చిన ప్రేమనగర్ అనే సినిమాకి రీమేక్. ఇందులో శివాజీ గణేషన్ హీరోగా నటించగా, అతని సోదరుడి పాత్రలో ‘విజయ్’ నటించారు. ఈసినిమాలోనే బాల నటుడిగా వెంకటేష్ ఓ పాత్రను పోషించారు. వెంకటేష్ విజయ్ కు చిన్న తమ్ముడి క్యారెక్టర్ పోషించగా, విజయ్ కూతురిగా శ్రీదేవి నటించింది. అంటే శ్రీదేవి బాబాయి పాత్రలో వెంకటేష్ కనిపించారు.ఈ చిత్రం వచ్చిన 19 ఏళ్ల తరువాత, 1991లో క్షణక్షణం అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాలో వెంకటేష్, శ్రీదేవి హీరో-హీరోయిన్లుగా నటించారు. ఈ థ్రిల్లర్ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా, వెంకటేష్-శ్రీదేవి జంట కెమిస్ట్రీ ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించింది.
వెంకీ- శ్రీదేవి కలిసి నటించిన ఏకైక సినిమా క్షణక్షణం కావడం విశేషం. 1994లో వచ్చిన ఎస్పీ పరశురాం చిత్రంతో శ్రీదేవి తన తెలుగు సినీ ప్రయాణానికి ముగింపు పలికింది. ఆ తర్వాత బాలీవుడ్లో బిజీ అయింది. శ్రీదేవిలాగే, మీనా కూడా బాలనటిగా తన సినీ ప్రయాణం ప్రారంభించింది. ఆమె 1984లో వచ్చిన తమిళ చిత్రం అన్బుల్లా రజినీకాంత్ లో రజినీకాంత్ కుమార్తె పాత్రలో నటించింది. కొన్ని సంవత్సరాల తర్వాత, అదే రజినీకాంత్ సరసన ముత్తు వంటి హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించి ప్రేక్షకుల మనసు గెల్చుకుంది మీనా.