‘ఫస్ట్ పార్ట్ హిట్. దానికి సీక్వెల్ వస్తుందనగానే ఆడియన్స్ ఎక్సయిట్ అవుతారు. అయితే.. సినిమా పూర్తయి విడుదలకి వచ్చేసరికి దానిపై బజ్ తగ్గొచ్చు. ఆసక్తి పలచబడకముందే వేడివేడిగా వడ్డించేయాలని గప్‌చిప్‌గా సినిమాను పూర్తి చేశాం. ఇప్పుడు వస్తున్న బజ్ చూస్తుంటే మా స్ట్రాటజీ కరెక్టే అనిపిస్తుంది’ అన్నారు హీరో శ్రీసింహా కోడూరి.
ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘మత్తువదలరా 2’ శ్రీసింహ తొలి విజయం ‘మత్తువదలరా’ చిత్రానికి ఇది సీక్వెల్. ఫరియా అబ్దుల్లా కథానాయిక. రితేష్‌రానా దర్శకుడు. చిరంజీవి(చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మాతలు. ఈ నెల 13న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీసింహా సోమవారం విలేకరులతో ముచ్చటించారు. ‘ఫస్ట్ పార్ట్‌కి పూర్తి భిన్నంగా నా గెటప్ ఉంటుంది.
యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువే ఉంటాయి. ‘హీ టీమ్ ఏజెంట్స్’గా ఇందులో కనిపిస్తాం. ఫస్ట్‌పార్ట్‌లో డెలివరీ బాయ్స్‌గా ఉన్నమేం హీ టీమ్ ఏజెంట్స్‌గా ఎలా మారాం అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. ఫస్ట్పార్ట్కి సరిగ్గా మ్యాచ్ అయ్యేలా ఆర్గానిక్‌గా కథ తయారైంది. ఈ క్రెడిట్ అంతా దర్శకుడిదే.’ అని శ్రీసింహ పేర్కొన్నారు.
ఫరియా అబ్దుల్లా పాత్రలో ఫన్‌తో పాటు యాక్షన్ కూడా ఉంటుందని, ఈ సినిమాలో తను పాట రాసి, కొరియోగ్రాఫ్ చేయడం ప్రమోషన్స్‌కి బాగా యూజ్ అయ్యిందని ఆయన అన్నారు. రాజమౌళి, ప్రభాస్‌లకు ట్రైలర్, టీజర్ నచ్చాయని ప్రొడక్ట్ విషయంలో వాళ్లు చాలా హ్యాపీగా ఉన్నారని, అన్నీ కుదిరితే ఈ ఫ్రాంచైజీ కొనసాగుతుందని శ్రీసింహా తెలిపారు.