కంటెంట్‌ను నమ్ముకొని అంతా కొత్తవాళ్లతో తాము చేసిన ప్రయత్నం ఫలించిందని అన్నారు ‘శ్రీ చిదంబరం గారు’ దర్శకుడు వినయ్ రత్నం. ఆయన నిర్ధేశకత్వంలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం థాంక్స్‌మీట్‌ను నిర్వహించారు.
మలయాళ పరిశ్రమ నుంచి కూడా సినిమా బాగుందనే ప్రశంసలు లభిస్తున్నాయని, మనలోని బలహీనతల్ని జయించాలనే సందేశం కలబోసిన ఈ కథను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. నిజాయతీగా తాము చేసిన ప్రయత్నానికి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, చిదంబరం ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతికి లోనవుతున్నారని నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.