సినిమా పేరు : సింగిల్
తారాగణం: శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్..
దర్శకత్వం: కార్తీక్ రాజు
నిర్మాతలు: విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి..
నిర్మాణం: గీతా ఆర్ట్స్
విడుదలకు ముందే మంచి బజ్ క్రియేటైన సినిమా ‘సింగిల్’. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీవిష్ణు, కేతిక, ఇవానా.. ఇలా ఓ కొత్త కాంబినేషన్ కుదరడం కూడా సినిమాపై అంచనాలు ఏర్పడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడలేదు. విభిన్నంగా ముందుకెళ్లారు. దాంతో ఈ సినిమా చూడాలనే ఉత్సుకత ఆడియన్స్‌లో మొదలైంది. ఎట్టకేలకు శుక్రవారం ‘సింగిల్’ విడుదలైంది. మరి అనుకున్నట్టు అందరి అంచనాలను ‘సింగిల్’ నిజం చేసిందా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు.. అసలు ఈ సినిమా కథేంటో తెలుసుకుందా.
కథ:
విజయ్(శ్రీవిష్ణు) ఓ బ్యాంక్‌లో ఉద్యోగి. తోటివారంతా లవర్స్‌తో సెటిలైపోతుంటే.. తానుమాత్రం ఇంకా సింగిల్‌గానే ఉండటం విజయ్ భరించలేకపోతుంటాడు. అలాంటి సందర్భంలో తనకు పూర్వ(కేతిక) తారసపడుతుంది. తొలి ప్రేమలోనే తను ప్రేమలో పడిపోతాడు. ఆమెను ప్రేమలో పడేసేందుకు సమస్త ప్రయత్నాలూ చేస్తుంటాడు. ఇదిలావుంటే.. హరిణి(ఇవానా) అనే డాన్స్ టీచర్ విజయ్‌ని ప్రేమిస్తూ వుంటుంది. విజయ్‌ని ఎలాగైనా ప్రేమలో పడేసేందుకు తను ప్రయత్నిస్తుంటుంది. మరి పూర్వని విజయ్ ప్రేమలో పడేశాడా? హరిణి ప్రయత్నం సఫలం అయ్యిందా? హరిణి, విజయ్ ఇద్దరిలో ఎవరి ప్రేమ గెలిచింది? ప్రేమ అంటూ గెలిస్తే.. మరి ఈ సినిమాకు ‘సింగిల్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ:
‘సింగిల్’ అనేది నిజంగా ఓ సింపుల్ కథ. ఇలాంటి కథలతో సినిమాలు చేస్తే సక్సెస్ తేలిగ్గా కొట్టేయొచ్చు. ఇదొక సరదాగా సాగిపోయే ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ. క్యారెక్టర్ల మధ్య సాగే కన్ఫ్యూజనే ఈ సినిమా కథనం. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా దర్శకుడు కార్తీక్‌రాజు ఈ సినిమాను మలిచాడు. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడా బోర్ కొట్టదు. హీరో తొందరపడి ఓ అమ్మాయిని పోగొట్టుకుంటాడు. ఆలస్యం చేసి మరో అమ్మాయిని దూరం చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి మధ్య సాగిన డ్రామాను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్‌రాజు. పైకి అల్లరిగా సరదాగా కనిపిస్తున్నా.. అంతర్లీనంగా మంచితనం, బాధ్యత కలిగిన వ్యక్తిగా హీరోను చూపించడం బావుంది. శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలన్నీ కడుపుబ్బా నవ్వించాయి. అలాగే.. ఇద్దరు హీరోయిన్లతో శ్రీవిష్ణు సీన్స్ కూడా యువతరాన్ని కట్టి పడేస్తాయి. కేవలం నవ్వించడానికి మాత్రమే రూపొందిన సినిమా ఇది.
నటీనటులు:
శ్రీవిష్ణు తన కామెడీ టైమింగ్‌తో అద్భుతంగా నటించాడు. తన గత చిత్రాలను మించి జోష్‌గా ఇందులో కనపడ్డారాయన. నవ్వించడం మాత్రమే కాదు, ఎమోషనల్ సన్నివేశాలను కూడా తనదైన రీతిలో రక్తికట్టించాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు తర్వాత చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ వెన్నెల కిశోర్. శ్రీవిష్ణుకు సరైన సపోర్ట్‌ని అందించి, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు వెన్నెల కిశోర్. ఆయన కామెడీ సినిమాకు ప్రధాన బలం. ఇక హీరోయిన్లు కేతిక, ఇవానా చాలా అందంగా కనిపించారు. చక్కగా నటించారు. వీటీవీ గణేష్ కామెడీ సినిమాకు మరో ఎస్సెట్. సినిమాలో చాలా చిన్న పాత్ర పోషించారు డా.రాజేంద్రప్రసాద్. ఆయన చేయదగ్గ పాత్ర అయితే కాదది. ఇక ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది? మొత్తంగా ఇందులో పాత్ర ధారులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతికంగా:
ఓ చిన్న కథను.. అద్భుతమైన కథనంతో ముందుకు నడిపించిన దర్శకుడు కార్తీక్‌రాజును నిజంగా అభినందించాలి. మూడు పాత్రల చుట్టూ ఈ కథను తిప్పుతూ ఎక్కడా విసుగు లేకుండా సినిమాను రన్ చేశారాయన. నిజానికి చెప్పుకునేంత గొప్ప కథ కాదిది. కానీ చిన్న లైన్‌ని రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా మలిచాడు దర్శకుడు. డైలాగులు కూడా బాగా రాసుకున్నాడు. కొన్ని కామెడీ డైలాగులు బాగా పేలాయి. వేల్రాజ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. స్క్రీన్ అంతా రిచ్‌గా ప్రజెంట్ చేశారాయన. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కూడా బావుంది. ఎడిటింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ బావున్నాయి. బరువైన కథ, కథనాలను ఆశించి, ఈ సినిమాకు వస్తే నిరాశే మిగులుతుంది. కేవలం కాసేపు హాయిగా నవ్వుకోవాలనుకుంటే ‘సింగిల్’ బెస్ట్ ఆప్షన్.
బలాలు:
కథనం, నటీనటుల నటన, దర్శకత్వం, కెమెరా, మ్యూజిక్..
బలహీనత:
కేవలం కథ
రేటింగ్: 3.5/5