సినిమా పేరు : స్వాగ్
తారాగణం: శ్రీవిష్ణు, రీతూవర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, రవిబాబు, సునీల్..
దర్శకత్వం: హసిత్ గోలి
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
నిర్మాణం: పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ
సామజవరగమన, ఓం భీ బుష్ లాంటి హిట్స్ తర్వాత శ్రీవిష్ణు హీరోగా నటించిన సినిమా ‘స్వాగ్’. పైగా దర్శకుడు హసిత్ గోలీ గతంలో శ్రీవిష్ణుతోనే ‘రాజ రాజ చోర’ లాంటి క్లీన్ ఎంటర్టైనర్ని అందించి విజయం సాధించి ఉన్నారు. మరీ ముఖ్యంగా ప్రతిష్టాత్మక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న సినిమా. ఈ కారణాల చేత విడుదలకు ముందే ఈ సినిమాపై ఆడియన్స్‌లో హైప్ నెలకొని ఉంది. ప్రచారంలో భాగంగా ఈ కథ గురించీ, శ్రీవిష్ణు నాలుగు పాత్రల గురించీ తెలియడంతో కచ్చితంగా ఇది వైవిధ్యమైన సినిమానే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ శుక్రవారం ‘స్వాగ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అందరి అంచనాలను ‘స్వాగ్’ అందుకున్నదా? అనుకున్న విధంగానే ఆడియన్స్‌కి వినోదాన్ని పంచిందా? అనేది తెలుసుకోవాలంటే ముందు కథలోకెళ్లాలి.
కథ
స్వాగణిక వంశ వారసత్వం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఆ వంశానికి వారసత్వంగా ఓ నిధి ఉంటుంది. నిజమైన ఆ వంశ వారసుడికే ఆ నిధి దక్కాలని ఓ కుటుంబం ప్రయత్నిస్తుంటుంది. అందుకే.. నిజమైన వారసుడి కోసం ఆ కుటుంబం వెతుకుతుంటుంది. ఇదిలావుంటే.. ‘స్వాగణిక వంశ వారసుడివి నువ్వే.. వెళ్లి ఆ నిధి తెచ్చుకో..’ అంటూ కొందరికి ఉత్తరాలు అందుతాయి. ఆ సంపద మాదే నంటూ, మమే నిజమైన వారసులం అంటూ.. భవభూతి(శ్రీవిష్ణు), అనుభూతి(రీతూవర్మ), సింగ (శ్రీవిష్ణు) ఈ ముగ్గురు రంగంలోకి దిగుతారు. అసలు ఈ స్వాగణిక వంశ కథేంటి? నిజానికి ఈ వారసత్వ సంపద ఎవరిది? అసలైన వారసుడు ఇంకెవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
సినిమా ఆద్యంతం కన్ఫ్యూజన్. ఇలాంటి కథ విషయంలో స్క్రీన్‌ప్లే బాగా రాసుకోవాలి. కథలో కన్ఫ్యూజన్ ఉన్నా.. దాన్ని అర్థమయ్యేలా ప్రేక్షకులకు చెప్పగలగాలి. ఈ విషయం దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ఆ వంశాలేంటో?.. ఆ వంశ వృక్షాలేంటో..? ఇందులో ఎవరికి ఎవరు ఏమవుతారో? అర్థంకాక జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి. ప్రచార చిత్రాల్లో రెండుమూడు జోకులు నవ్వించాయి. సినిమాలో కూడా అవి మాత్రమే ఉంటాయి. దర్శకుడు నవ్వించాలని శతవిధాలా ప్రయత్నించాడు కానీ.. ఎవరికీ నవ్వురాలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. నిజానికి ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన సెన్సిటీవ్ సబ్జెక్ట్. మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ తుదకు ట్రాన్స్‌జెండర్ పాయింట్ దగ్గర ఆగాడు దర్శకుడు. కానీ.. దాన్ని జనానికి నచ్చేలా చెప్పలేకపోయాడు. మనసుల్ని తాకే సన్నివేశాలు మచ్చుకైనా ఇందులో కనిపింవ్.
ఎవరు ఎలా చేశారు?
శ్రీవిష్ణుకు అద్భుతంగా నటించే అవకాశం అయితే వచ్చింది కానీ.. దాన్ని సద్వినియో చేసుకోలేకపోయాడనే చెప్పాలి. ఇందులో ఆయన నాలుగు పాత్రలు చేశారు. ఓ పాత్రలో ‘ఇంద్రుడు-చంద్రుడు’లో కమల్‌హాసన్‌ని గుర్తు చేశారు. కానీ ఇమిటేట్ చేస్తున్నట్టు అర్థమైపోతున్నది. ఇందులో సింగ అనే పాత్ర కూడా చేశారు శ్రీవిష్ణు. నిజానికి యూత్‌కి బాగా కనెక్టయ్యే పాత్ర అది. దర్శకుడు ఆ పాత్రపై ఇంకాస్త శ్రద్ధ పెడితే బావుండేది. రీతూవర్మ, మీరా జాస్మిన్ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే గోపరాజు రమణ పాత్ర ప్రేక్షకులను అలరిస్తుంది.
సాంకేతికంగా..
దర్శకుడు హసిత్ హోలి కథపై ఇంకాస్త శ్రద్ధ పెడితే బావుండు అనిపించింది. ముఖ్యంగా కథనం ఆసక్తిగా లేదు. వివేక్ సంగీతం పర్లేదు అనిపిస్తుంది. వేదరామన్ కెమెరా పనితనం మాత్రం అద్భుతం. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఖర్చుకు వెనుకాడలేదు.
మొత్తంగా దర్శకుడైతే అక్కడక్కడ నవ్వించాడు.. శ్రీవిష్ణు విభిన్న పాత్రలతో కొత్తగా కనిపించాడు. స్లో నేరేషన్.. బోరింగ్, రిపీటెడ్ సీన్స్ ఈ సినిమాకు మైనస్‌లు మారాయి. కాసేపు నవ్వుకోవాలని సినిమాకెళ్లే ఆడియన్స్‌కి మాత్రం కొంతవరకు ఈ సినిమా నిరాశనే మిగిల్చిందని చెప్పాలి.
బలాలు
అక్కడక్కడ నవ్వులు, కెమెరా, నేపథ్య సంగీతం
బలహీనతలు
కథ, కథనం, పాటలు
రేటింగ్ – 2.75/5