శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రానికి ‘కామ్రేడ్ కళ్యాణ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ ప్రోమోను దసరా సందర్భంగా విడుదల చేశారు. 1992లో ఆంధ్ర, ఓడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇదని ప్రోమో చెబుతున్నది.
ఇందులో నక్సలైట్ నాయకు డు కామ్రెడ్ కళ్యాణ్గా శ్రీవిష్ణు కనిపించారు. తన కోసం పోలీసులు విడుదల చేసిన 5 లక్షల రివార్డ్ వాంటెడ్ పోస్టర్‌ను తనే స్వయంగా అతికించడం ఈ ప్రోమోలో ట్విస్ట్. హ్యూమర్, యాక్షన్, రొమాన్స్, కలగలుపుగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. శ్రీవిష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ కథానాయిక.
రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమయే కీలక పాత్రధారులు. ఇదిలావుంటే.. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే తన కొత్త సినిమాను కూడా పట్టాలెక్కించేశారు శ్రీవిష్ణు. తనకు బ్లాక్బాస్టర్ ‘సామజవరగమనా’ను అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరోసారి ఆయన నటించనున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయిదుర్గతేజ్ క్లాప్ ఇచ్చి, స్క్రిప్ట్‌ను హీరో నారా రోహిత్‌తో కలిసి నిర్మాతలకు అందజేశారు. నరేశ్, వెన్నెలకిశోర్, సుదర్శన్, దర్శకులు వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.