శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. 1992 ఆంధ్ర-ఒరిస్సా నేపథ్యంలో జరిగే కథ ఇది. శనివారం ఈ సినిమా నుంచి ‘ఒరియా పిల్ల..’ అనే తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘కామ్రేడ్ కల్యాణ్’ తాలూకు రొమాంటిక్ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఈ పాట సాగింది. విజయ్ బుల్గానిన్ మెలోడీ ప్రధానంగా చక్కటి బాణీని సమకూర్చారు.
భాస్కరభట్ల సాహిత్యం ప్రధానాకర్షణగా నిలిచింది. ఈ సినిమా కోసం 1990 దశకంలో జరిగిన యథార్థ సంఘటనలకు కాల్పనిక అంశాలను జోడించి కోన వెంకట్ అద్భుతమైన కథను తయారుచేశారని, ఇందులో తాను ఓ కొత్త భాషలో మాట్లాడానని, అదేమిటో తెరపై చూసి తెలుసుకోవాలని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్టైనర్గా నిలుస్తుందనే నమ్మకం ఉందని రచయిత, నిర్మాత కోన వెంకట్ పేర్కొన్నారు. సినిమాలోని నాలుగు పాటలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని దర్శకుడు జానకిరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.