Sonu Sood | సినిమాల్లో ఎవరైనా హీరోగా కనిపించొచ్చు. కానీ నిజ జీవితంలో హీరో అనిపించుకోవాలంటే అంత ఆషా మాషి కాదు. ఎదుటి వ్యక్తి బాధను తనదిగా భావిస్తూ, వారికి అండగా నిలవాలంటే ఎంతో మంచి మనసు ఉండాలి. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సోనూసూద్. వెండితెరపై విలన్ పాత్రలు పోషించినా, జీవితంలో మాత్రం ఆయన కన్నా గొప్ప రియల్ హీరో ఇండస్ట్రీలో చాలా కొద్దిమందే.ఎవరైన సమస్యలో ఉన్నారన్న సమాచారం తెలిసింది అంటే చాలు వెంటనే తన టీమ్‌ను పంపించి వారి పరిస్థితి తెలుసుకుంటారు, అవసరమైన సాయం చేసేవరకు వెనకడుగు వేయరు. కరోనా కాలంలో ఆయన చేసిన సేవలు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందినవే. ఆ సమయంలో చాలా మంది అతనిని “రియల్ హీరో”గా కొలిచారు.
అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని సోనూసూద్ స్వయంగా పరామర్శించారు. వెంకట్ మరణించిన సమయంలో విదేశాల్లో ఉన్న ఆయన, వెంటనే వీడియో కాల్ ద్వారా కుటుంబాన్ని ఓదార్చారు. వచ్చి తప్పకుండా కలుస్తాను అని మాటిచ్చిన ఆయన, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వెంకట్ నివాసానికి వెళ్లిన సోనూసూద్, వెంకట్ చిత్రపటానికి నివాళులర్పించి, అతని భార్య, పిల్లలను పరామర్శించారు. వెంకట్ నాకు సోదరుడి లాంటి వాడు. అతని కుటుంబం ఇప్పుడు నా కుటుంబమే. ఏ సహాయం కావాల్సినా నేరుగా నాకు చెప్పండి అంటూ తన వ్యక్తిగత నంబర్‌ను కూడా ఇచ్చారు.
వెంకట్ కుమార్తె స్రవంతి మీడియాతో మాట్లాడుతూ, సోనూసూద్ సార్ చేసే సాయానికి ఎంత చెప్పినా తక్కువే. మా ఇంటి నిర్మాణ బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారు. నాన్న దశదిన కర్మలకు రూ. లక్షన్నర ఇచ్చారు. ఆర్థికంగా ఆ సాయం చేయకపోతే దశదిన కర్మ అంత గ్రాండ్‌గా జరగేది కాదు. జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాం అంటూ భావోద్వేగానికి గురయ్యారు. విలన్ పాత్రల్లో క్రూరంగా కనిపించినా, సోనూసూద్ హృదయం మాత్రం అపారమైన మానవత్వంతో నిండి ఉంది. బాధలో ఉన్నవారికి అండగా నిలబడే ఆయన సహాయాలు ఎంతోమందికి బతుకుల్లో వెలుగునిచ్చాయి. ఇప్పుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి ఇచ్చిన ఆత్మీయ మద్దతు ఆయనను మరోసారి రియల్ హీరోగా నిలబెట్టింది.