దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఏం చేసినా సంచలనమే. ‘అర్జున్ రెడ్డి’ ‘యానిమల్’ చిత్రాలతో ఫిల్మ్‌మేకింగ్, స్టోరీ ప్రజెంటేషన్ పరంగా కొత్త ఒరవడిని సృష్టించారు. ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గురువారం ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఆయన తాజా చిత్రాల సంగతులతో పాటు కొత్త పోస్టర్స్ అభిమానుల్ని అలరించాయి. సౌండ్స్టోరీ పేరుతో ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన ఓ ఆడియో క్లిప్‌ని రిలీజ్ చేశారు. ఇందులో కేవలం సంభాషణల ద్వారానే కథాంశం గురించి బేసిక్ డిటేయిల్స్ అందించే ప్రయత్నం చేశారు. ప్రభాస్, ప్రకాష్‌రాజ్ మధ్య చోటుచేసుకునే ఇంటెన్స్ డైలాగ్ వార్ గూజ్బంప్స్ తెప్పించేలా ఉంది. ఆడియో క్లిప్‌లోని సంభాషణలను బట్టి ఈ సినిమాలో ప్రభాస్ ఐపీఎస్ ఆఫీసర్ అని అర్థమవుతున్నది.
అయితే ప్రవర్తన సరిగ్గా లేదనే కారణంతో రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్తాడు. అక్కడ సూపరింటెండెంట్‌గా ఉన్న ప్రకాష్‌రాజ్..ప్రభాస్‌ని ఖైదీ డ్రెస్‌ను ధరించమని ఆదేశిస్తాడు. అందుకు తిరస్కరించిన ప్రభాస్ ‘డియర్ సూపరింటెండెంట్ సార్.. చిన్నప్పటి నుంచి నాకో చెడ్డ అలవాటు ఉంది. రైట్ ఫ్రమ్ మై చైల్డ్‌వుడ్.. ఐ హ్యావ్ ఏ బ్యాడ్ హాబిట్’ అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ఈ డైలాగ్‌ని బట్టి ప్రభాస్ క్యారెక్టర్ ధిక్కార స్వభావంతో ఉండబోతున్నదని అర్థమవుతున్నది. సినిమా గ్లింప్స్‌ని ఆడియో ద్వారా తెలియజేయడం ఇదే ప్రథమమని.. సరికొత్త ప్రయోగమిదని అంటున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తున్నది. ఈ పాన్ ఇండియా చిత్రం త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.