Sonu Sood | తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో మంది ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు ఫిష్ వెంకట్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి వార్త సినీ ఇండస్ట్రీకి తీరనిలోటు. ఎన్నో హాస్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన వెంకట్ మృతితో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, సామాజిక సేవా కార్యక్రమాలతో ‘రియల్ హీరో’గా పేరుగాంచిన సోనూసూద్ హైదరాబాద్‌కు వచ్చి ఫిష్ వెంకట్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా పరామర్శించారు.
ఫిష్ వెంకట్ నివాసానికి సోనూసూద్ స్వయంగా వెళ్లి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గౌరవం నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ ..”మీ బాధను నేను కూడా అనుభవిస్తున్నాను. ఏదైన సాయం కావాలి అంటే నిర్భయంగా నన్ను సంప్రదించండి. మీకు నేను అండగా ఉంటాను,” అని అన్నారు. ప్రస్తుతం సోనూసూద్‌కి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సోనూసూద్ దాతృత్వంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా వేలాది వలస కార్మికులకు బస్సులు, ట్రైన్లు ఏర్పాటు చేసి, ఆహారం, మందులు అందించి ప్రజల మనసుల్లో ‘మానవతావాది’గా నిలిచిన సోనూసూద్ ఇప్పుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి ఈ విధంగా మద్దతుగా నిలవడం మరోసారి ఆయన మానవతా హృదయాన్ని ప్రతిబింబిస్తోంది. వెంకట్ కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా, బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన సోనూసూద్ చర్యపై సినీ వర్గాలు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఫిష్ వెంకట్ తెలుగులో హాస్యనటుడిగా మూడు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ, తనదైన శైలిలో ప్రేక్షకుల్ని అలరించారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో చిన్నా పెద్దా పాత్రలు పోషిస్తూ, కామెడీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణం తెలుగు సినిమా అభిమానులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది.