చిత్రసీమలో కొందరు నాయికలు మూర్తీభవించిన ధైర్యానికి, నమ్మిన విలువల్ని ఆచరించే రాజీలేని తత్వానికి ప్రతీకలుగా కనిపిస్తారు. వారి దృష్టిలో జీవితమంటే నిత్యం గెలవాల్సిన యుద్ధం. ప్రతి రోజూ కొత్త మజిలీలను వెతుక్కుంటూ చేయాల్సిన ప్రయాణం. కెరీర్ పరమైన అవరోధాలు వారిని ఏమాత్రం కదిలించలేవు. ఆరోగ్యపరమైన సవాళ్లను మనోధైర్యంతో జయించగలరు. జీవిత ఉత్థానపతనాల్లో కూడా స్థితప్రజ్ఞత ప్రదర్శించడం వారి నైజం. ఆలోచనల్లో మాత్రమే కాదు, ఆచరణలో కూడా వారి మార్గం అనితరసాధ్యం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమదైన బలమైన వ్యక్తిత్వంతో వెండితెరపై రాణిస్తున్న అగ్ర కథానాయికల గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు..
దక్షిణాది చిత్రసీమలో కథానాయిక సాయిపల్లవి పంథాయే వేరు. కథాంశాల ఎంపిక మొదలుకొని వ్యక్తిగత జీవితం వరకు ఆమె ప్రతీ అడుగు ప్రత్యేకమే. ‘భానుమతి..సింగిల్‌పీస్’ అనే తన డైలాగ్ మాదిరిగానే రాజీలేని ధోరణికి ప్రతీక సాయిపల్లవి. సాధారణంగా కథానాయికలు వాణిజ్య ఉత్పత్తులకు ప్రచార కర్తలుగా వ్యవహరిస్తూ భారీ మొత్తంలో ఆర్జిస్తుంటారు. వాటిలో బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే సాయిపల్లవి మాత్రం సౌందర్య ఉత్పత్తుల యాడ్స్‌లో నటించేందుకు పూర్తిగా వ్యతిరేకం. మూడేళ్ల క్రితం ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఆమెకు దాదాపు మూడు కోట్లు ఆఫర్ చేశారు. ఓ సినిమా పారితోషికంతో సమానమైన అమౌంట్ అది. అయినా ఆ యాడ్‌లో నటించలేనని తేల్చిచెప్పింది సాయిపల్లవి. ‘మనం భారతీయులం. మనం జన్మతః పొందిన శరీరవర్ణం ఇదే. విదేశీయులను చూసి వాళ్లలా మారాలనుకోవడం తప్పు. ఆఫ్రికన్లు వారి వర్ణంలోనే అందంగా కనిపిస్తారు కదా. అందం రంగులో ఉండదు. చూసే కళ్లలో ఉంటుంది’ అంటూ ఆ వాణిజ్య ప్రకటనను తిరస్కరించింది. రాజకీయ, సామాజిక అంశాల్లో కూడా తన మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుం దామె. ‘కశ్మీర్‌ఫైల్స్’ సిని మా గురించి, గోరక్షకుల ఆగడాల గురించి గతంలో సాయిపల్లవి ధైర్యంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన సాయిపల్లవి తాను పుట్టిన కోటగిరి (కోయంబత్తూరు దగ్గరలోని టౌన్) ప్రాంత ప్రజల కోసం ఆసుపత్రి నిర్మించి సేవలందిస్తానని చాలా సందర్భాల్లో చెప్పింది.
అగ్ర కథానాయికగా సమంత ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నైలో సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి ప్రయాణం ప్రారంభించిన ఆమె దక్షిణాదిన అగ్ర కథానాయికగా ఎదిగిన వైనం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. పదమూడేళ్ల సుదీర్ఘ కెరీర్లో టాప్ హీరోలందరితో జతకట్టి ఎన్నో కమర్షియల్ విజయాల్ని తన ఖాతాలో వేసుకొంది. అయితే గత రెండేళ్లుగా ఆమె జీవితంలో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. రెండేళ్ల క్రితం నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం, కొద్ది మాసాల కిత్రం మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధిన బారిన పడటంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే అన్ని ప్రతికూలతల్ని జయించి ఫీనిక్స్‌లా పైకెగసింది సమంత. మనోధైర్యాన్ని కూడదీసుకొని పోరాటం సాగించింది. ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత షూటింగ్స్‌తో బిజీ అవుతున్నది. తెలుగులో ‘ఖుషి’తో పాటు, హిందీలో ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ షూటింగ్స్‌తో బిజీగా ఉంది. జీవితంలో కొన్నిసార్లు ధైర్యంగా ఉండటం మినహా మరో ప్రత్యామ్నాయం ఉండదని, జీవితంలో తాను మళ్లీ మంచి రోజుల్ని చూస్తానని ఆశగా ఉంది సమంత.
పశ్చిమ కనుమల్లో అందాలతో అలరారే కూర్గ్ ప్రాంతంలో జన్మించింది రష్మిక మందన్న. ఇరవయేళ్ల ప్రాయంలోనే సినీ రంగ ప్రవేశం చేసింది. కన్నడంలో తన తొలి చిత్ర హీరో రక్షిత్‌శెట్టితో ఎంగేజ్మెంట్ రద్దు..ఆ తర్వాత పరిణామాలు ఆమె కెరీర్‌పై ఎంతో ప్రభావం చూపించాయి. అయినా చెక్కుచెదరని సంకల్పంతో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంది. ‘ఛలో’ ‘గీత గోవిందం’ ‘పుష్ప’ వంటి చిత్రాలతో తెలుగులో తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంత చేసుకుంది. అటు తమిళ, హిందీ చిత్రసీమల్లో కూడా తనదైన ముద్రతో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ పాన్ ఇండియా చిత్రాలున్నాయి. ‘సమయం మనకోసం ఆగదు. ప్రతి రోజు గొప్ప జ్ఞాపకాల్ని పొందే ప్రయత్నం చేయాలి’ అన్నది రష్మిక మందన్న ఫిలాసఫీ. ‘జీవితంలో ఏదీ అంత త్వరగా మన దరి చేరదు.. మనకు ఇష్టమైన దానికోసం ప్రతి రోజు పోరాటం చేయాల్సిందే’ అనే మాటల్ని వేదవాక్కులా పాటిస్తుంటుందీ భామ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తొలి చిత్ర నిర్మాణ సంస్థ పేరును చెప్పడానికి రష్మిక విముఖత చూపించిందని సోషల్‌మీడియాలో ఆమెపై ట్రోల్స్ నడిచాయి. అయినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది.
‘ఓం శాంతి ఓం’ చిత్రంతో మంగళూరు సోయగం దీపికాపడుకోన్ బాలీవుడ్ కెరీర్ గొప్పగా ప్రారంభమైంది. అనంతరం వరుసగా భారీ కమర్షియల్ చిత్రాల్లో కథానాయికగా నటించి విజయాల్ని సొంతం చేసుకుంది. అయితే కెరీర్ మధ్యలో డిప్రెషన్లోకి వెళ్లిపోవడం దీపికా కెరీర్‌ను కుదిపేసింది. ‘2014లో నేను తీవ్రమైన డిప్రెషన్‌తో సతమతమయ్యాను. జీవితంలో ఏదో శూన్యం ఆవహించిందనే భావనలో ఉండేదాన్ని. బ్రతకడంలో అర్థం లేదనిపించింది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది దీపికా పడుకోన్. తీవ్రమైన డిప్రెషన్ నుంచి కోలుకొని మరలా అగ్ర కథానాయికగా రాణించడం ఆమె బలమైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా చెబుతారు. ఇటీవల విడుదలైన ‘పఠాన్’ చిత్రం దీపికా పడుకోన్ పేరు ప్రతిష్టల్ని మరింతగా ఇనుమడింపచేసింది. లేడీసూపర్‌స్టార్ అనే ఇమేజ్ను తెచ్చిపెట్టింది.
దక్షిణాదిలో తనపై ఉన్న గ్లామర్ నాయిక అనే ముద్రను చెరిపివేసుకోవడానికి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది పంజాబీ సుందరి తాప్సీ. అక్కడ మహిళా ప్రధాన చిత్రాలపై దృష్టి పెట్టింది. అలా ‘పింక్’తో బాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ‘ఎన్ని అపజయాలు వచ్చినా సరే సినిమాల ఎంపికలో నా ప్రాధామ్యాల్ని మార్చుకోను. మహిళా ప్రధాన ఇతివృత్తాలకే ప్రాధాన్యతనిస్తా. ఓ నటిగా నన్ను కొత్తగా పరిచయం చేసుకోవాలన్నదే నా లక్ష్యం అని చెబుతుంటుంది తాప్సీ.